సెయింట్‌‌ లూయిస్‌‌ ర్యాపిడ్‌‌ అండ్‌‌ బ్లిట్జ్‌‌ టోర్నీ: కరువానకు గుకేశ్‌‌ చెక్‌‌..

సెయింట్‌‌ లూయిస్‌‌ ర్యాపిడ్‌‌ అండ్‌‌ బ్లిట్జ్‌‌ టోర్నీ: కరువానకు గుకేశ్‌‌ చెక్‌‌..

సెయింట్‌‌ లూయిస్‌‌: ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌‌, వరల్డ్‌‌ చాంపియన్‌‌ డి. గుకేశ్‌‌.. గ్రాండ్‌‌ చెస్‌‌ టూర్‌‌లో భాగంగా జరుగుతున్న సెయింట్‌‌ లూయిస్‌‌ ర్యాపిడ్‌‌ అండ్‌‌ బ్లిట్జ్‌‌ టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచాడు. గురువారం ముగిసిన ర్యాపిడ్‌‌ చివరి మూడు రౌండ్లలో గుకేశ్‌‌ ఒక ఓటమి, రెండు విజయాలు నమోదు చేశాడు. లినియర్‌‌ డొమ్నిగ్వేజ్‌‌ పెరెజ్‌‌ (అమెరికా)తో జరిగిన ఏడో రౌండ్‌‌ గేమ్‌‌లో గుకేశ్‌‌ ఓటమిపాలయ్యాడు. అయితే వెంటనే తేరుకున్న ఇండియన్‌‌ ప్లేయర్‌‌ ఎనిమిది, తొమ్మిదో రౌండ్లలో వరుసగా వెస్లీ సో (అమెరికా), ఫ్యాబియానో కరువాన (అమెరికా)కు చెక్‌‌ పెట్టాడు. ఫలితంగా 10 పాయింట్లతో నాలుగో స్థానం సంపాదించాడు.

వరుసగా మూడో రోజు తొలి రౌండ్‌‌లో ఓడినా.. తర్వాతి గేమ్‌‌ల్లో గుకేశ్‌‌ సత్తా చాటడం విశేషం. ర్యాపిడ్‌‌ సెక్షన్‌‌లో కరువాన (14), అరోనియన్‌‌ (13), వాచిర్‌‌ లాగ్రేవ్‌‌ (11) టాప్‌‌–3లో నిలిచారు. తలా 9 పాయింట్లతో డొమ్నిగ్వేజ్‌‌, అబ్దుసత్తారోవ్‌‌, వెస్లీ వరుసగా ఐదు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నారు. లియామ్‌‌ (7), షాంక్లాండ్‌‌ (5), ఒపారిన్‌‌ (3) తర్వాతి ప్లేస్‌‌ను సొంతం చేసుకున్నారు. బ్లిట్జ్‌‌ సెక్షన్‌‌లో 18 రౌండ్స్‌‌ జరగనున్నాయి.