తరుగుపై ప్రశ్నించిన కౌలు రైతుపై కేసు

తరుగుపై ప్రశ్నించిన కౌలు రైతుపై కేసు
  • కరీంనగర్ ​జిల్లా వేగురుపల్లిలో ఘటన

కరీంనగర్, వెలుగు: తరుగు కింద అన్యాయంగా 11 బస్తాలు వడ్లు తీశారనే ఆవేదనతో వడ్ల కొనుగోలు కేంద్రంలోని గోదాంకు తాళం వేసిన కౌలు రైతుపై కేసు ఫైల్​అయింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధిత రైతు కథనం ప్రకారం.. వేగురుపల్లికి చెందిన ఇట్టవేణి సంపత్ 10 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. పండిన పంటను ఏప్రిల్ 14న స్థానిక పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి తరలించాడు. వర్షాల టైంలో అధికారులు టార్పాలిన్ ఇవ్వకుంటే తానే రూ.2 వేలు పెట్టి కొనుక్కున్నాడు. ఈ నెల 2న కాంటాలు పూర్తయ్యాక వడ్లను రైస్ మిల్లుకు తరలించారు. వడ్లు అమ్మి 20 రోజులు దాటినా డబ్బులు పడకపోవడం, భూమి యజమాని కౌలు పైసలు అడుగుతుండడంతో సంపత్ ఇటీవల కొనుగోలు కేంద్రానికి వెళ్లాడు.

సెంటర్ ఇన్​చార్జి ద్వారా తరుగు కింద 11 బస్తాలను కట్ చేసినట్లు తెలియడంతో ఆందోళనకు గురైన సంపత్ ​40 కిలోల బస్తాకు 42 కిలోలు కాంటా వేశాక ఎలా కట్ చేశారని నిలదీశాడు. రైస్ మిల్లు దగ్గరకు వెళ్లి అడగమని సెంటర్​ ఇన్​చార్జ్​ సమాధానం ఇవ్వడంతో సంపత్​ గోదాంకు తాళం వేసి నిరసన తెలిపాడు. సదరు ఇన్​చార్జ్​ ఫిర్యాదుతో రైతు సంపత్​పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే 11 బస్తాల తరుగు ఎలా తీస్తారని ప్రశ్నించినందుకు తనపై కేసు పెట్టారని, తనుకు చావే దిక్కు అని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతు తీసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది.