
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు బిగ్ షాక్ తగిలింది. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో షకీల్ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. తన కొడుకు సోహెల్ దుబాయ్ పారిపోయేందుకు షకీల్ సహకరించినట్లుగా పోలీసులు గుర్తించారు. సోహెల్ దుబాయ్ కు పారిపోయేందుకు పది మంది సహాయం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు రిమాండ్ కు తరలించారు. సోహెల్ ను దుబాయ్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఏం జరిగింది?
2023 డిసెంబర్ 23వ తేదీన అర్ధరాత్రి 2.45 గంటలకు ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను సోహెల్ కారు ఢీకొట్టింది. పంజాగుట్ట పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. కారు నడిపింది సోహెల్‌గా గుర్తించారు. బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ కోసం పంజాగుట్ట స్టేషన్‌కు తీసుకెళ్లారు. షకీల్ అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు సమాచారం. సోహెల్‌ను కేసు నుంచి తప్పించి.. అతని ఇంట్లో పని చేస్తున్న అబ్దుల్ ఆసిఫ్‌ను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేశారు.
సీసీ టీవీ ఫుటేజీ పరిశీలన
బ్రీత్ ఎనలైజ్ టెస్ట్‌కు తీసుకెళ్తున్న టైమ్‌లో సోహెల్ పారిపోయాడని ప్రచారం జరిగింది. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారన్న విషయం సీపీ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన అంతర్గత విచారణకు ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఎంక్వైరీ చేశారు. ప్రజాభవన్ నుంచి పోలీస్ స్టేషన్ దాకా ఉన్న సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. స్టేషన్‌లోని కెమెరాలను చూశారు.
సోహెల్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు గుర్తించారు. నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు సోహెల్‌ను తప్పించి అబ్దుల్ ఆసిఫ్ ను నిందితుడిగా చేర్చినట్లు డీసీపీ విజయ్ కుమార్ కు అర్థమైంది. ఆ రోజు నైట్ డ్యూటీలో సీఐ దుర్గారావు, ఏఎస్ఐ విజయ్‌కాంత్ ఉన్నట్లు గుర్తించారు. కాగా, విచారణ జరుపుతున్న టైమ్‌లో ఇన్స్పెక్టర్ దుర్గారావు అస్వస్థతకు గురికాగా.. అతన్ని కేర్ హాస్పిటల్‌కు తరలించారు. తర్వాత ఇన్స్పెక్టర్ దుర్గారావును సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.