ఉద్యోగాలిప్పిస్తామని ఘరానా మోసం

ఉద్యోగాలిప్పిస్తామని ఘరానా మోసం

హైదారాబాద్లో మరో కంపెనీ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. లక్షల జీతంతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. మంచి ఉద్యోగం దొరుకుతుందని ఆశపడి లక్షల రూపాయలు చెల్లించిన యువతీయువకులు మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు.

అమీర్ పేట డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసిన కేటుగాళ్లు నిరుద్యోగులకు గాలం వేశారు. ఆన్ లైన్ జాబ్, వర్క్ ఫ్రం హోం, యూఎస్ బేస్డ్ కంపెనీ ఉద్యోగాలిప్పిస్తామని ఆశ కల్పించింది. ఒక పేజీ స్కాన్ చేస్తే రూ.5 చెల్లిస్తామని చెప్పడంతో వందల మంది ఆసక్తి చూపారు. అయితే కంపెనీ నిర్వాహకులు అందుకోసం లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పడంతో చాలా మంది ఆ మొత్తం చెల్లించారు. తొలుత వర్క్ కు సంబంధించిన మొత్తంతో పాటు డిపాజిట్ గా తీసుకున్న లక్ష రూపాయలు తిరిగి ఇచ్చేయడంతో చాలా మందికి నమ్మకం కుదిరింది. దీంతో రెండోసారి ఒక పేజీ స్కాన్ చేస్తే రూ.10 ఇస్తామని అందుకోసం రూ.3 నుంచి రూ.5లక్షలు డిపాజిట్ చేయాలని చెప్పడంతో దాదాపు 700 మంది రూ.30కోట్ల మేర చెల్లించారు.

నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన డిజినల్ ఇండియా నిర్వాహకులు రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేశారు. ఫోన్ ఎత్తకపోవడం, ఆఫీసుకు తాళాలేసి ఉండటంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులను ఆశ్రయించారు. డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అమిత్ శర్మపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.