రోహిత్ కాళ్ళు మొక్కిన అభిమానిపై కేసు నమోదు

రోహిత్ కాళ్ళు మొక్కిన అభిమానిపై కేసు నమోదు

హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో గురువారం(జనవరి 25) భారత్- ఇంగ్లాండ్  మొదటి టెస్ట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆటలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. విరాట్‌ కోహ్లీ అభిమాని వచ్చి టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ కాళ్లు మొక్కాడు. ఇన్నింగ్స్ విరామం కావడంతో భద్రతా సిబ్బంది కాస్త విశ్రాంతి తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే ఆసరాగా తీసుకున్న ఆ యువకుడు నేరుగా అతడు హిట్ మ్యాన్​ వద్దకు దూసుకొచ్చి కాళ్ల మీదపడ్డాడు. దీంతో రోహిత్‌ అతడిని పైకి లేపి బయటికి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. 

ఈ ఘటన తర్వాత పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నామని.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అయితే భారీ సెక్యూరిటీని దాటుకొని గ్రౌండ్ లోకి వెళ్లిన ఈ యువకుడిపై పోలీసులు సీరియస్ అయ్యారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కుర్రాడి వయసు 20 సంవత్సరాలు. ఇతనిది ఖమ్మం జిల్లాలోని అశ్వరారావు పేట మండలం రామ చంద్రాపురం గ్రామానికి చెందినవాడు.   

ఆసక్తికర విషయం ఏంటంటే రోహిత్‌ శర్మ కాళ్లు మొక్కింది విరాట్‌ కోహ్లీ అభిమానిగా తెలుస్తోంది. ఎందుకంటే రోహిత్‌ కాళ్లు మొక్కిన ఆ అభిమాని విరాట్‌ పేరుతో 18వ నంబర్‌ ఉన్న జెర్సీని ధరించి వచ్చాడు. కాగా, టీమ్​ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అతడు ఆడకపోయినా అతడి నామస్మరణతో ఉప్పల్‌ స్టేడియం మార్మోగిపోయింది. తమ ఆరాధ్య క్రికెటర్‌ను స్మరించుకుంటూ మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కేరింతలు కొడుతూ మ్యాచ్​ను ఎంజాయ్​ చేశారు.