భూమి పట్టా చేసి ఇస్తానని డబ్బులు వసూలు: భూపాలపల్లి జిల్లాలో రైతును మోసగించిన వ్యక్తిపై కేసు

భూమి పట్టా చేసి ఇస్తానని డబ్బులు వసూలు: భూపాలపల్లి జిల్లాలో రైతును మోసగించిన వ్యక్తిపై కేసు

మొగుళ్లపల్లి,వెలుగు: భూమి పట్టా చేసి ఇస్తానని రైతు నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో ఒకరిపై  కేసు నమోదైంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ ఐ అశోక్ కథనం ప్రకారం.. మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి గ్రామానికి చెందిన రైతు గజ్జి ఐలయ్య దగ్గర 5 గుంటల భూమిని ఏడేండ్ల కింద అదే మండలంలోని చింతలపల్లికి చెందిన లడే తిరుపతి  రూ. 2.65 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.

కాగా.. ఆ భూమి ఆన్ లైన్ రికార్డుల్లో తన పేరు మీద ఉందని రైతు ఐలయ్యను అదే గ్రామానికి చెందిన దుర్గం సురేశ్ బెదిరించాడు. ఆ భూమిని పట్టా చేసి ఇస్తానని నమ్మించి రూ. 87,500 వసూలు చేశాడు. పట్టా విషయమై పలుమార్లు సురేశ్ ను రైతు ఆడిగినా పట్టించుకోలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా..  సురేశ్ పై కేసు నమోదు చేశారు. అలాగే సురేశ్​పై ఇప్పటికే పలు కేసులు నమోదై కోర్టులో విచారణలో ఉన్నాయి. సురేశ్ కొన్నేండ్లుగా ఆన్ లైన్ పేపర్లలో పని చేస్తూ  మొగుళ్లపల్లి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ నని చెప్పుకుంటూ పలువురిని మోసగించినట్టు తెలిసింది.