ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డిపై ..భూకబ్జా కేసు

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డిపై ..భూకబ్జా కేసు
  •  ఆయన భార్య నీలిమా, మరొకరిపై కూడా..
  • డూప్లికేట్ డాక్యుమెంట్లతో ప్లాట్​ కబ్జా చేస్తున్నారని బాధితురాలి ఫిర్యాదు
  • ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోచారం ఐటీ కారిడార్​ పోలీసులు

హైదరాబాద్, వెలుగు :  జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన భార్య నీలిమా, మరొకరిపై భూకబ్జా కేసు నమోదైంది. డూప్లికేట్​డాక్యుమెంట్లతో లేఅవుట్​ను అగ్రికల్చర్​ల్యాండ్​గా కన్వర్ట్​చేసి తన ప్లాట్​ను ఆక్రమించుకునే ప్రయత్నం చేశారనే బాధితుల ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్​ పోలీస్​స్టేషన్​లో ఎఫ్ఐఆర్ ​రిజిస్టర్​అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్​కేసర్ చౌదరిగూడ గ్రామంలో సర్వే నెంబర్ 796లోని రామంతపూర్​కు చెందిన ఎంఏ రషీద్, ఖాదర్లకు చెందిన పట్టా భూమిలో 1984, 1985 ప్రాంతంలో167 ప్లాట్లతో గ్రామ పంచాయతీ స్థాయిలో ఓ వెంచర్ వేశారు.

2020లో చాలా మంది ఈ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేశారు. గుండాల మండలానికి చెందిన ఉటుకూరు మల్లేశం అనే వ్యక్తి కూడా ఈ వెంచర్​లో ప్లాట్​కొన్నాడు. ఈయన దగ్గర మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ బుద్ధానగర్ కు చెందిన ముచ్చర రాధిక150 గజాల ప్లాట్ కొనుగోలు చేశారు. తాను కొనుగోలు చేసిన ప్లాట్​కు బౌండరీస్ ఏర్పాటు చేసుకున్నారు. గాయత్రీ ఎడ్యుకేషన్ ట్రస్టుకు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన భార్య పల్లా నీలిమా, మధుకర్ రెడ్డి అక్రమంగా తన ప్లాట్ లోకి ప్రవేశించి, హద్దులు చేరిపేయడంతోపాటు ఆ ప్లాట్​లో గుంతలు తీశారని, ప్లాట్​హద్దులు ఎందుకు చెరిపివేస్తున్నారని ప్రశ్నించగా ఆ ప్లాట్ తమకు చెందుతుందని బూతులు తిడుతూ, బెదిరిస్తున్నారని ప్లాట్​ఓనర్​రాధిక ఇటీవల పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

డూప్లికేట్​డాక్యుమెంట్లు తయారు చేసి, లేఅవుట్​ను అగ్రికల్చర్​ ల్యాండ్​గా మార్చి తమ భూమిని ఆక్రమించాలని చూస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ ​పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా పల్లా రాజేశ్వర్​ రెడ్డిని, ఏ2గా ఆయన భార్య నీలిమాను, ఏ3గా మధుకర్​రెడ్డి పేర్లను చేర్చారు.