జగిత్యాల జిల్లాలో మరో భోలేనాథ్ బాబా.. అమ్మాయిలను లోబర్చుకోవడం.. సంతానం కలిగిస్తానని మోసం చేయడం..

జగిత్యాల జిల్లాలో మరో భోలేనాథ్ బాబా..  అమ్మాయిలను లోబర్చుకోవడం.. సంతానం కలిగిస్తానని మోసం చేయడం..

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బాబా బోలేనాథ్ వ్యవహారం సంచలనంగా మారింది. భక్తి పేరుతో మహిళలను లోబర్చుకోవడం.. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయటం మొదలైన ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు బాబా. సంతానం కలిగిస్తానని ఒక జంట దగ్గర 40 వేల రూపాయలు వసూలు చేసిన కేసుతో బాబా భోలేనాథ్ మోహన్ యోగి లీలలు వెలుగులోకి వచ్చాయి. 

వివాదాస్పద బాబా భోలేనాథ్ మోహన్ యోగిపై 2026 జూన్ 01న కేసు నమోదు చేశారు పోలీసులు.​  సంతానం కలిగిస్తానని నమ్మించి మోసం చేశాడంటూ జంగిటి భార్గవి-రాజేశ్వర్ దంపతులు పోలీసులను ఆశ్రయించారు.  నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనసముద్రం గ్రామానికి చెందిన ఈ దంపతులు తమ వద్ద  రూ. 40 వేలు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు మెట్‌పల్లి ఎస్ఐ సురేష్ బాబు.

​ అమాయక భక్తులను నమ్మించి డబ్బులు వసూలు చేయడంతో పాటు, కొంతమంది మహిళలను లైంగికంగా లోబర్చుకున్నట్లు బాబాపై ఆరోపణలు ఉన్నాయి. ​ బాబాకు సంబంధించిన లైంగిక ఆరోపణలు, ఆర్థిక మోసాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు  ప్రకటించారు.

  • పంక్చర్ షాపు, ఆటో డ్రైవర్ నుంచి కోటీశ్వరుడు వరకు:

సొంతి మోహన్ అలియాస్ భోలేనాథ్ కార్నాల అనే బాబా.. నిజామాబాదులో​ ఎస్సారెస్పీ ముంపు గ్రామం నుంచి కొన్నేళ్ల క్రితం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బర్దిపూర్ గ్రామానికి వలస వచ్చాడు. ​గతంలో తండ్రి సైకిల్ పంక్చర్ షాప్, తల్లి టీ స్టాల్ నడుపుతుండగా.. పెండ్లి తర్వాత కొన్ని రోజులు ఆటో నడిపాడు. ఆ తర్వాత గల్ఫ్ కి వెళ్లి వచ్చి బాబాగా అవతారం ఎత్తాడు.

​గల్ఫ్ నుండి వచ్చిన తర్వాత బర్దిపూర్ గ్రామ శివారులో ఆశ్రమం, గుడి నిర్మించి భోలేనాథ్ బాబాగా మారాడు.  ప్రతి శుక్రవారం పూనకంతో పూజలు చేస్తూ ప్రజలను ఆకర్శించాడు. హిందూ భక్తులతో పాటు ముస్లిం భక్తులను ఆకర్షించేందుకు  దర్గాలను నిర్మించాడు భోలేనాథ్ బాబా.

​ పూనకం పూజలతో సంతానం కలుగుతుందని ప్రచారం చేసి, అమాయక భక్తుల నమ్మకంతో కోట్ల రూపాయలు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి.  ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో బాబా భార్య భాగ్యశ్రీ పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. 

  • ఫోటోలు వీడియోల కలకలం:

​ ఆటో నడుపుకుని జీవించిన వ్యక్తి కోట్ల రూపాయల ఆస్తులు, లగ్జరీ బీఎండబ్ల్యూ (BMW) కారు కొనే స్థాయికి ఎలా వచ్చాడంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. బాబా లీలలకు సంబంధించి 
​ఫోటోలు, వీడియోల కలకలం రేపాయి. భక్తులైన కొందరు మహిళలతో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న సెల్ఫీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో  తీవ్ర వివాదం రేగింది. 

​ కొందరు కక్ష గట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల గ్రామానికి చెడ్డపేరు వస్తుందని జగిత్యాల జిల్లా ఎస్పీకి కొందరు మహిళా భక్తులు ఫిర్యాదు చేశారు. సంతానం పేరుతో డబ్బులు వసూలు చేసిన విషయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

జిల్లా ఎస్పీ ఆదేశాలతో వివాదాస్పద బాబా లీలలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  మరోవైపు సోషల్ మీడియా, లోకల్ పత్రికల్లో తనపై వచ్చిన వార్తలపై పరువు నష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీసులు పంపించారు బాబా భోలేనాథ్.