అల్వాల్, వెలుగు: నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి ఇతరుల ఆస్తి కాజేయాలని ప్రయత్నించిన మహిళపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. సైనిక్ పురికి చెందిన దాసరి లక్ష్మి తన భర్త డెత్ సర్టిఫికెట్ కోసం మల్కాజిగిరి మండల ఆఫీసులో దరఖాస్తు చేసుకుంది. అధికారులు దరఖాస్తును తిరస్కరించారు. దీంతో ఆమె అల్వాల్ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసింది.
తహసీల్దార్ ధ్రువపత్రాన్ని జారీ చేసినట్లు సృష్టించి ఇతరుల ఆస్తిని కాజేయడానికి ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న అల్వాల్ తహసీల్దార్ రాములు, ఆ మహిళపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రశాంత్ తెలిపారు.
