హైదరాబాద్లో అట్టహాసంగా స్పోర్ట్స్ ఫెస్టివల్

హైదరాబాద్లో అట్టహాసంగా  స్పోర్ట్స్ ఫెస్టివల్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ–నార్త్ ఈస్ట్ కనెక్ట్ లో భాగంగా రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో  హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన స్పోర్ట్స్ ఫెస్టివల్ అట్టహాసంగా సాగింది. తొలుత గోపీచంద్ అకాడమీలో బ్యాడ్మింటన్ పోటీలను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించి, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య ఉన్న బలమైన గ్రామీణ క్రీడా సంస్కృతి బంధాన్ని కొనియాడారు. 

గచ్చిబౌలి స్టేడియంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రముఖ అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతల పర్యవేక్షణలో ఫుట్‌‌బాల్, జిమ్నాస్టిక్స్, సెపక్ తక్రా, టేబుల్ టెన్నిస్ వంటి ఆటల్లో ప్రత్యేక కోచింగ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ ఎంటర్ ప్రెన్యూర్స్, జర్నలిస్టుల సదస్సు నిర్వహించారు. 

అనంతరం జరిగిన ఫుట్‌‌ బాల్ మ్యాచ్‌‌లో తెలంగాణ విమెన్స్ టీమ్ 2–0 గోల్స్ తేడాతో నార్త్ ఈస్ట్ స్టేట్స్ టీమ్‌‌పై నెగ్గగా..  మెన్స్‌‌లో ఈశాన్య రాష్ట్రాల జట్టు పైచేయి సాధించింది. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, శాట్జ్‌‌ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి, అధికారులు, కోచ్‌లు పాల్గొన్నారు.