నౌహీరా షేక్ రూ.19 కోట్ల ఆస్తులు వేలం.. త్వరలో మరో రూ.68 కోట్ల ఆస్తులు వేలం వేయనున్న ఈడీ

నౌహీరా షేక్ రూ.19 కోట్ల ఆస్తులు వేలం.. త్వరలో మరో రూ.68 కోట్ల ఆస్తులు వేలం వేయనున్న ఈడీ
  •     ఇన్వెస్టర్లను 5,978 కోట్లకుపైగా మోసం చేసిన హీరా గ్రూప్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధిపతి నౌహీరా షేక్‌‌‌‌‌‌‌‌కు చెందిన రూ.19.64 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌(ఈడీ) వేలం వేసింది. వేలం వేసిన ఆస్తులను కొనుగోలు చేసిన వారి పేరిట సబ్-రిజిస్ట్రార్ రిజిస్టర్ చేశారు. 

ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ యూనిట్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే 36 శాతం కంటే ఎక్కువ లాభాలు ఇస్తామని నమ్మించి డిపాజిటర్లను మోసం చేసిన సంగతి తెలిసిందే.  

మొత్తం  రూ.5,978 కోట్లకు పైగా పెట్టుబడులు సేకరించారు. కానీ, ప్రిన్సిపల్ మొత్తం కూడా తిరిగి ఇవ్వకుండా లక్షలాది మందిని మోసం చేశారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసింది.

వేలం ద్వారా వసూలైన డబ్బు బాధితులకు ఇలా..

హీరా గ్రూప్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ కంపెనీస్ పేరుతో కొల్లగొట్టిన డబ్బుతో నౌహీరా షేక్ తన పేరుతో పాటు తన కంపెనీలు, బంధువుల పేర్ల మీద భారీ ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. ఇప్పటివరకు సుమారు రూ. 428 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. 

ఈ కేసులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్, సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌‌‌‌‌‌‌‌లను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ప్రత్యేక పీఎంఎల్‌‌‌‌‌‌‌‌ఏ కోర్టులో దాఖలు చేసి.. సుప్రీంకోర్టు ఆమోదం తర్వాత ఎంఎస్‌‌‌‌‌‌‌‌టీసీ ద్వారా వేలం ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటి వరకు వేలం వేయగా వచ్చిన ఆస్తుల నుంచి రూ.25 కోట్లు వసూలు అయ్యాయి. 

త్వరలో మరో రూ.68.63 కోట్లు డిపాజిట్ అవుతాయని అధికారులు తెలిపారు. మొత్తంగా రూ.93.63 కోట్ల విలువైన ఆస్తుల వేలం ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని నౌహీరా షేక్ , హీరా గ్రూప్ మోసంతో నష్టపోయిన పెట్టుబడిదారులకు పరిహారంగా పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు.