చేనేతను ప్రపంచ స్థాయికి పెంచేలా ఐఐహెచ్‌‌‌‌‌‌‌‌టీ : మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

చేనేతను ప్రపంచ స్థాయికి పెంచేలా ఐఐహెచ్‌‌‌‌‌‌‌‌టీ : మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
  • ఏడాదిన్నరలో చేనేత రంగానికి వెయ్యి కోట్లు ఇచ్చాం : తుమ్మల
  • చేనేత భవన్​లో ఐఐహెచ్​టీ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: చేనేత రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలపటమే ప్రభుత్వ లక్ష్యమని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. నాంపల్లి చేనేత భవన్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌‌‌‌‌‌‌‌లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌‌‌‌‌‌‌‌టీ) ప్రయోగశాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ చేనేతకు ప్రత్యేక ప్రయోజనం కల్పించాలనే దృష్టితో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించి ఈ ప్రతిష్టాత్మక సంస్థను రాష్ట్రానికి సాధించారని తెలిపారు. 

కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తిగా ఈ సంస్థకు ఆయన పేరు పెట్టాలని నిర్ణయించామన్నారు. కేవలం ఏడాదిన్నరలో రూ.1000 కోట్ల నిధులు విడుదల చేయడం ప్రభుత్వానికి చేనేత రంగం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్‌‌‌‌‌‌‌‌తో రాష్ట్రంలోని చేనేత కార్మికులకు నిరంతరమైన ఉపాధి లభించిందని తెలిపారు. వేములవాడలో రూ.50 కోట్లతో యార్న్ డిపో ఏర్పాటు చేశామన్నరు. 

ఇప్పటి వరకు 2,368 టన్నుల నూలును మరమగ్గాల సంఘాలకు సరఫరా చేశామని చెప్పారు. నేతన్న పొదుపు, నేతన్న భరోసా వంటి పథకాల కింద రూ.304 కోట్లు, పొదుపు కింద రూ.68 కోట్లు, నూలు సబ్సిడీ బకాయిల చెల్లింపుల కోసం రూ.40 కోట్లు, వ్యక్తిగత రుణమాఫీ కోసం రూ.33 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. ప్రోగ్రాంలో హ్యాండ్‌‌‌‌‌‌‌‌లూమ్ అండ్ టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులు పాల్గొన్నారు.