బీసీ నినాదం ఎత్తుకున్నందుకే నాపై కేసులు : వట్టే జానయ్య యాదవ్

బీసీ నినాదం ఎత్తుకున్నందుకే నాపై కేసులు : వట్టే జానయ్య యాదవ్

బహుజనుల కోసం బీసీ నినాదాన్ని ఎత్తుకున్నందుకే తనపై మంత్రి జగదీశ్​రెడ్డి అక్రమ కేసులు నమోదు చేయించారని బీఆర్‌‌‌‌ఎస్ నేత, సూర్యాపేట డీసీ‌‌‌‌ఎం‌‌‌‌ఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ఆరోపించారు. మంత్రి జగదీశ్​ రెడ్డితో విభేదించిన జానయ్య.. సూర్యాపేటలో పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించిన అనంతరం.. ఆయనపై 72మంది భాదితులు తమ భూములను ఆక్రమించారంటూ కేసులు పెట్టారు. దీంతో గత నెల 26న అజ్ఞాతంలోకి వెళ్లిన జానయ్య మొదటిసారి ఆయనకు జరిగిన అన్యాయంపై స్పందించారు. 

శనివారం మీడియాకు ఓ వీడియో పంపి.. అందులో తన ఆవేదనను వెల్లడించారు. తొమ్మిదేండ్లలో పెట్టని కేసులు తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన మరుసటి రోజే ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని కొందరు ప్రజాప్రతినిధులు మంత్రికి దగ్గరగా ఉండే తనకు మొరపెట్టుకున్నారని, ఆ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే వాటిని పరిగణనలోకి తీసుకోకపోగా.. ఆయనకు దగ్గరగా ఉండే పార్టీలోని కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేసేందుకు, మంత్రి జగదీశ్​ రెడ్డితో అనుకున్న లక్ష్యాలు ప్రజలకు చేరుతాయన్న ఉద్దేశంతో అనాడు బీ‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్ లో చేరానని వివరించారు. 

అధికారం ఉన్నదని తప్పుడు కేసులు నమోదు చేస్తే ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి పక్కన ఉండే వ్యక్తుల దౌర్జన్యాలు, అక్రమాలను కూడా సమయం వచ్చినప్పుడు బయట పెడుతానని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఫిర్యాదులపై సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, తనపై అక్రమ కేసులు పెట్టిన  బాధితులతో న్యాయ నిపుణుల సమక్షంలో బహిరంగ చర్చ జరపాలని కోరారు. వాటిలో తనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పారు. రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటానని ప్రకటించారు.