దోషులను శిక్షించే వరకు ఉద్యమిస్తం

దోషులను శిక్షించే వరకు ఉద్యమిస్తం
  • ఆధారాలున్నా ఎందుకు అరెస్టు చేస్తలేరు?: సంజయ్​ 
  • నేరం చేసినోళ్లను వదిలి.. న్యాయం కోసం పోరాడుతున్న వాళ్లపై కేసులు పెడుతరా? అని ఫైర్

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ బాలికపై జరిగిన అఘాయిత్యం ఘటనలో నేరం చేసిన వాళ్లను వదిలి.. న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న బీజేపీ  నాయకులు, కార్యకర్తలతోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు పెట్టడం ఏమిటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఈ ఘటనలో తగిన ఆధారాలున్నా దోషులను అరెస్ట్ చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారని మంగళవారం ఒక ప్రకటనలో పోలీసులను ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, దోషులను శిక్షించే వరకు బీజేపీ ఉద్యమిస్తూనే ఉంటుందని హెచ్చరించారు.‘‘బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసు పెట్టేందుకు చూపిస్తున్న ఉత్సాహం దోషులను అరెస్టు చేసే విషయంలో చూపిస్తే బాధితురాలికి న్యాయం జరిగేది. అఘాయిత్యం​ కేసులో టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే రాష్ట్ర ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తున్నది. ఇలాంటి అత్యాచార ఘటనలు రోజుకొక్కటి వెలుగు చూడడం రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు నిదర్శనం” అని బండి సంజయ్​ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకానితనంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘‘నేరాలను అరికట్టడంలో తామే నెంబర్ వన్ అని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్  గొంతు జూబ్లీహిల్స్​ గ్యాంగ్​ రేప్​ విషయంలో ఎందుకు మూగబోయింది. ఈ ఘటనపై ఎందుకు స్పందించరు?” అని ఆయన ప్రశ్నించారు.