పెరుగుతున్న గృహ హింస​ కేసులు

పెరుగుతున్న గృహ హింస​ కేసులు
  • సఖి సెంటర్లలోనే మూడేండ్లలో 23 వేల కేసులు 
  • ఏడాదికి సగటున 8 వేల కేసులు నమోదు 
  • పోలీస్​ స్టేషన్​లలో అంతకంటే ఎక్కువే కంప్లయింట్లు
  • భరించలేక ప్రాణాలు తీస్కుంటున్న మహిళలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో గృహ హింస​ కేసులు పెరుగుతున్నయి. ఆర్థిక సమస్యలు, అనుమానాలు, ఇగోలు, డామినేషన్​ వంటివి కుటుంబాల్లో కలహాలను రేపుతున్నయి. ఈ క్రమంలో కొందరు మహిళలు తమ ప్రాణాలను తీసుకుంటుండగా, మరికొందరు కన్న పిల్లలనూ చంపి, ఆత్మహత్య చేసుకుంటున్నరు. కొన్ని కేసుల్లో కుటుంబాలు విడిపోతున్నయి. పోలీసు స్టేషన్లు కాకుండా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సఖి సెంటర్లలోనే ఇలాంటివి మూడేళ్లలో 23 వేల కేసులు నమోదయ్యాయి. 2017 ఆగస్టు నుంచి ​ ఈ ఏడాది అక్టోబర్​ వరకు సఖి కేంద్రాలలో 33,538 కేసులు నమోదైతే అందులో డొమెస్టిక్​ వయిలెన్స్​ కింద నమోదైన కేసులే ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్​లో పేర్కొన్నారు. ఈ లెక్కన ఏడాదికి యావరేజ్​గా 8 వేల కేసులు నమోదవుతున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నరు. సఖి కేంద్రాలలో కాకుండా నేరుగా పోలీస్​ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు ఎక్కువగా నే ఉంటాయని అంటున్నరు. ఇంట్లో చిన్న విషయాలను పెద్దదిగా చేసుకుని గొడవలు పడుతున్నారని, ఎక్కువగా చదువుకున్న వాళ్లు, ఉద్యోగాలు చేసేవారే గృహ హింసకు పాల్పడుతున్నరని ఆఫీసర్లు చెప్తున్నరు.  

హింస.. వేధింపులపై 11 లక్షల కాల్స్​
ఆడవాళ్ల మీద లైంగిక వేధింపులు, గృహ హింస, సెక్సువల్​ అబ్యూస్​, రేప్​, ట్రాఫికింగ్​​ వంటి వాటిపై స్పందించి తగిన చర్యలు తీసుకునేందుకు సఖి కేంద్రాలకు 181 విమెన్​ హెల్ప్​లైన్​ నంబర్​ ఏర్పాటు చేశారు. దీనికి ఇప్పటి వరకు 11.08 లక్షల కాల్స్​ వచ్చాయి. ఇందులో 11 లక్షల కాల్స్​ను అటెండ్​ చేసి, కొన్నింటికి ఫోన్​లోనే సరి చేయగా, మరికొన్నింటికి కౌన్సెలింగ్​ ఇచ్చి క్లియర్​ చేశారు. ఈ  కాల్స్​లో 70% గృహ హింసకు సంబంధించినవే ఉన్నాయి. కొందరు ఎంత కౌన్సెలింగ్​ చేసినా వినకపోవడంతో వారిపై కేసులు రిజిస్టర్​ చేశారు. న్యాయ, వైద్య, పోలీసు శాఖల సమన్వయంతో సఖి సెంటర్లలో  ఉచిత సేవలను అందిస్తున్నారు.  

ప్రతి ముగ్గురిలో ఒకరికి గృహ హింస
కేంద్ర వైద్యారోగ్య శాఖ రిలీజ్​ చేసిన నేషనల్​ ఫ్యామిలీ హెల్త్​ సర్వే ప్రకారం ప్రతి ముగ్గురు ఆడవాళ్లలో ఒకరు గృహ హింస ఎదుర్కొంటున్నారు.  27% మంది ఆడవాళ్లు పదిహేనేళ్ల లోపే శారీరక హింసకి గురవుతున్నారు. కరోనా ఫస్ట్​ వేవ్​లో గృహ హింస ఎక్కువగా పెరిగిందని, కంప్లయింట్​ చేస్తే హింస ఇంకా ఎక్కువవుతుందని, సమాజం చిన్నచూపు చూస్తుందని చాలామంది కేసులు పెట్టలేదని సఖి సెంటర్​లో పనిచేసే ఆఫీసర్​ ఒకరు తెలిపారు.  కుటుంబ పరువు, పిల్లల పరిస్థితి ఏమవుతుందన్న ఆలోచనతో వెనక్కి తగ్గిన వాళ్లూ ఉన్నారని చెప్పారు. 

901 బాల్యవివాహాలు  
మహిళలు, యువతులపై పురుషుల వేధింపులు తీవ్రమయ్యాయి. వీటిపై సఖి కేంద్రాల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. వరకట్న వేధింపుల కింద 1,705 కేసులు ఉన్నాయి. బాల్య వివాహాలపై 901 కేసులు, సైబర్​ క్రైమ్​, చీటింగ్​ కేసులు 1,556,  పోక్సో కింద 956, కిడ్నాప్​, మిస్సింగ్​ కింద 1,559, సెక్సువల్​ హరాస్​మెంట్​ కింద 268, రేప్​ కింద 348 కేసులు నమోదయ్యాయి. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో, నేరుగా తమను బ్లాక్‌‌‌‌మెయిల్‌‌‌‌ చేస్తున్నారని మరికొంత మంది కేసులు పెట్టారు. 

ఆడాళ్లు ప్రతిఘటించాలి
మహిళల మీద గృహ హింస కేసులు పెరిగిన మాట వాస్తవమే. సెపరేట్ మాడ్యుల్​ కూడా పెట్టాం. గతంలో చాలామంది మహిళలు కేసులు పెట్టేందుకు ముందుకు రాకపోతుండే. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎవరైనా సరే డొమెస్టిక్​ వయెలెన్స్​ కింద ఫిర్యాదు​ చేస్తే సమస్య ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ చేస్తాం. కౌన్సెలింగ్​ ఇప్పిస్తాం. అయినా గొడవలు జరగడం, మహిళలను హింసిస్తే కేసు పెడ్తం. భర్త కొట్టినప్పుడు ఆడవాళ్లు కచ్చితంగా ప్రతిఘటించాలి. 
- స్వాతి లక్రా, అడిషనల్​ డీజీపీ, విమెన్​ సేఫ్టీ, భరోసా

ఆలోచనల్లో మార్పు రావాలి
మద్యం అలవాటు, ఇన్ఫీరియారిటీ, తనదే నడవాలనే ఆలోచనలతో కుటుంబాల్లో గొడవలు పెరుగుతున్నయి. ‘డబ్బుల  విషయాల్లో భార్య వేలు పెట్టకూడదు. భర్త ఏం చేసినా ఎదురు చెప్పకూడదు. భర్త మూడ్​ని బట్టి నడుచుకోవాలి’ అనే మగవాళ్ల ఆలోచనల్లో మార్పు రావాలి. ఆడవాళ్లు కూడా ఏదైనా వయెలెన్స్​ జరిగితే దానిని మొదట్లోనే తుంచేయాలి. లేదంటే భరించలేని స్థితి వరకు వెళ్లి వాళ్లకు వాళ్లు ఏదో చేసుకుంటున్నరు. 
- డాక్టర్ గీతా చల్లా, సైకాలజిస్ట్​