
వికారాబాద్, వెలుగు : రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నారాయణ రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి రోడ్డులోని ఎరువులు, విత్తనాల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ శాఖలతో పాటు విత్తన, ఎరువుల డీలర్లు సమన్వయంతో పని చేస్తున్నారని పేర్కొన్నారు.
నకిలీ, కల్తీ విత్తనాల సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో 2 .63 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేయబడుతుందని, 5. 42 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరముందని, ప్రస్తుతం 3.12 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, ఎలాంటి కొరత లేదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. రైతులు కూడా అప్రమతంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారమివ్వాలని, నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనాలని పేర్కొన్నారు.
రైతుల సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలని, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని, ఎప్పటికప్పుడు స్టాక్ బోర్డు, స్టాక్ రిజిస్టర్ విధిగా నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించారు. సీడ్ డీలర్లు కూడా సర్టిఫికేషన్ ఉన్న విత్తనాలను మాత్రమే కొనాలని, రైతులు కొనుగోలు చేసిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులకు తప్పనిసరిగా రసీదులను ఇవ్వాలని స్పష్టంచేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, ఏవో జ్యోతి ఉన్నారు.
విధుల్లో అంకితభావంతో ఉండాలి : కలెక్టర్
వికారాబాద్, వెలుగు : ప్రతి ఉద్యోగి విధుల్లో నిజాయతీ, పారదర్శకతతో పని చేయాలని, తలవంచుకునే విధంగా ఉండొద్దని వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి హితవు పలికారు. శుక్రవారం కలెక్టరేట్ లో పదవీ విరమణ పొందిన జిల్లా పశు సంవర్థశాఖ అధికారి పి.అనిల్ కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిణి డి.సుధారాణికి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.
అనంతరం రిటైర్డ్ అధికారులకు జ్ఞాపికలు అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అడిషనల్ అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఎస్సీడీడబ్ల్యూవో మల్లేశం, పంచాయతీ రాజ్ ఈఈ ఉమేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజస్ , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, డీడబ్ల్యూవో జ్యోతి పద్మ, జిల్లా మత్స్య శాఖ అధికారి చరితారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.