
నిజామాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసేవారిపై సైబర్ క్రైం కింద కేసులు పెడ్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఇందుకోసం రాష్ట్రంలో మధ్యప్రదేశ్తరహా చట్టాన్ని తెస్తామని చెప్పారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని తెలిపారు. ఆమె చేసిన కామెంట్స్‌లో తల, తోక తీసేసి సోషల్ మీడియాలో మరోరకంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వారిపై కంప్లయింట్ చేస్తామని చెప్పారు. శనివారం నిజామాబాద్ ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షాల కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. యువనేతగా బృహత్తర కార్యక్రమాలతో చక్కని పాలన అందిస్తున్న సీఎంను మార్చాల్సిన అవసరం ఏముందని మహేశ్ కుమార్ గౌడ్ నిలదీశారు.
మంత్రులందరి మధ్య సఖ్యత ఉందని, ఎవరి నడుమ ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. ‘‘ఎలక్షన్ టైంలో ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ప్రజల పట్ల మేం పూర్తి బాధ్యతతో ఉంటున్నాం. మాకులేని సమస్య బీఆర్ఎస్, బీజేపీకి ఎందుకో అర్థంకాదు” అని వ్యాఖ్యానించారు.
త్వరలోనే మంత్రివర్గ విస్తరణ
ఈ నెలాఖరున లేదంటే జూన్ మొదటి వారంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అవకాశముందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ‘‘మంత్రి పదవుల కోసం కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. కూర్పులో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీ హైకమాండ్ ఈ పనిలోనే ఉంది. ఇప్పటికే లేటైనందున త్వరగా విస్తరణ జరిగితే బాగుంటుందని పీసీసీ ప్రెసిడెంట్ గా నా అభిప్రాయం చెప్పిన.
హైకమాండ్ అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా” అని తెలిపారు. అలాగే, ఈ నెల26,27 తేదీల్లో పీసీసీ కార్యవర్గం ఖరారయ్యే చాన్స్ ఉందని తెలిపారు. ‘‘కాంగ్రెస్ పార్టీ రోజువారీ కార్యక్రమాల పరిశీలనకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ వేయబోతున్నం. సీనియర్లకు సముచిత స్థానం కల్పిస్తూ సలహా మండలి కమిటీ ఏర్పాటు కాబోతున్నది” అని తెలిపారు.
బీఆర్ఎస్లో మూడు ముక్కలాట..
రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని మహేశ్‌గౌడ్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో కేటీఆర్, కవిత, హరీశ్‌రావు మధ్య ఆధిపత్యం పోరు నడుస్తున్నదని, ఇది మూడు ముక్కలాటను తలపిస్తున్నదన్నారు. ఇవన్నీ తెలిసే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రావడంలేదన్నారు. ‘‘బీఆర్ఎస్కు ప్రజలతో బంధం తెగిపోయింది. మళ్లీ అధికారం అనేది ఆ పార్టీకి కలగానే మిగులుతుంది.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే. అలాంటిది బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో కలుస్తుందని బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్‌రెడ్డి కామెంట్ చేయడం హాస్యాస్పదం’’ అని పేర్కొన్నారు. అద్భుత స్కీమ్స్‌తో తెలంగాణను తాము దేశానికి రోల్‌మోడల్‌గా మారుస్తున్నామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్‌తో యుద్ధం చేసి ఏం సాధించాం? ఏం కోల్పో యాం? అనేదానిపై కేంద్ర సర్కారు క్లారిటీ ఇవ్వడంలేదని విమర్శించారు. రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశవేణు తదితరులు ఉన్నారు.