నల్గొండలో రూ.3.04 కోట్లు సీజ్

నల్గొండలో రూ.3.04 కోట్లు సీజ్

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద రూ.3.04 కోట్ల నగదు సీజ్ చేశామని ఎస్పీ అపూర్వ రావు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని చోట్ల చెక్​పోస్టులు ఏర్పాటు తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ఎస్పీ ఆఫీస్​లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అపూర్వ రావు మాట్లాడారు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు మాడుగులపల్లి టోల్​గేట్ వద్ద ఎస్ఐ, సిబ్బంది వెహికల్స్ చెక్ చేస్తుండగా వైట్​కలర్ కారు ఆపకుండా వెళ్లిపోయిందన్నారు. 

దీంతో మాడుగులపల్లి పోలీసులు మిర్యాలగూడ డీఎస్పీకి సమాచారం ఇచ్చారని, ఆయన టు టౌన్ సీఐ నరసింహ రావును అప్రమత్తం చేశారని వివరించారు. ఈదులుగూడ సిగ్నల్ వద్ద కూడా వెహికల్​ను ఆపేందుకు ప్రయత్నించగా.. తప్పించుకుని వెళ్లిపోయిందన్నారు. వాడపల్లి వద్ద బారికేడ్​లు ఏర్పాటు చేసి వెహికల్​ను పట్టుకున్నామని తెలిపారు. వెహికల్ లో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. సీట్ల కింద చెక్ చేయగా రూ.3.04 కోట్ల నగదు గుర్తించామని వివరించారు.

డ్రైవర్​ను గుజరాత్​లోని అహ్మదాబాద్​కు చెందిన విపుల్ కుమార్​గా, మరో వ్యక్తిని మహేసేనకు చెందిన అమర్ సిన్హాజాలాగా గుర్తించామన్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేశామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా 2,800 మందిని బైండోవర్ చేశామని తెలిపారు. ఇప్పటి దాకా రూ.7.39 కోట్ల నగదు, రూ.40లక్షల విలువగల మద్యం, రూ.1.71 కోట్లు విలువ చేసే గంజాయి, రూ.80లక్షలు విలువ చేసే బంగారం పట్టుకున్నామని తెలిపారు.