బడ్జెట్​ సెషన్​లో కులగణనపై బిల్లు.. చట్టబద్ధంగా చర్చ జరుపుతాం : మంత్రి పొన్నం​

బడ్జెట్​ సెషన్​లో కులగణనపై బిల్లు..  చట్టబద్ధంగా చర్చ జరుపుతాం : మంత్రి పొన్నం​
  • మేధావులు, బీసీ సంఘాల సూచనలు తీసుకుంటం
  • ప్రతిపక్షాలు కూడా సలహాలు ఇవ్వొచ్చు
  • ఫూలే విగ్రహంపై కవిత పదేండ్లు ఎందుకు మాట్లాడలేదు
  • లిక్కర్​ కేసులో బిజీగా లేకపోవడం వల్లే కొత్త నాటకమని కామెంట్​

హైదరాబాద్, వెలుగు:  ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో బీసీ కులగణన చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ తేల్చి చెప్పారు. వచ్చే బడ్జెట్​ సెషన్​లో కులగణనపై బిల్లు పెడతామని, చట్టబద్ధమైన చర్చ జరుపుతామని ఆయన తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామన్నారు. రాహుల్​ గాంధీ అనేక సందర్భాల్లో కులగణన చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. బుధవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కులగణనపై ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి శాఖాపరమైన సమీక్ష నిర్వహించారని పొన్నం చెప్పారు. ప్రొఫెసర్లు, మేధావులు, బీసీ సంఘాల సలహాలు, సూచనలను కూడా తీసుకుంటామని, శాస్త్రీయంగా ఎలాంటి లోపాల్లేకుండా కులగణన నిర్వహిస్తామని తెలిపారు. బలహీనవర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాలు కూడా సలహాలు ఇవ్వవవచ్చని ఆయన సూచించారు. కొన్నేండ్లుగా మెస్​ చార్జీలు రాలేదని, ప్రస్తుతం ఎక్కడా ఆగకుండా చూస్తున్నామని, అందుకు గ్రీన్​ చానెల్​ను ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గురుకులాల్లో టీచింగ్, నాన్​ టీచింగ్​ స్టాఫ్​ను భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.   

కవిత నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడాలె..

బీఆర్​ఎస్​ఎమ్మెల్సీ కవిత నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ హెచ్చరించారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఫూలే గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బీఆర్​ఎస్​ పార్టీలో పదవులు ఇచ్చాక వాళ్లు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు. బీఆర్ఎస్​ప్రెసిడెంట్, వర్కింగ్​ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత పదవులు బీసీలకు ఇచ్చి మాట్లాడాలన్నారు. ఫూలే విగ్రహం పేరిట కవిత రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. లిక్కర్​ కేసులో బిజీగా లేనట్టుందని, అందుకే కొత్తగా ఫూలే విగ్రహమంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

బీసీ కులగణనను బీఆర్ఎస్​, బీజేపీ పట్టించుకోలే: ఆది శ్రీనివాస్​

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేయలేదని, బీసీ కులగణనను పట్టించుకోలేదని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ విమర్శించారు. కాంగ్రెస్​ పార్టీ బలహీన వర్గాల కోసం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందన్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగానే కులగణనను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. 

కులగణనకు బీజేపీ వ్యతిరేకం: మధు యాష్కీ 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులగణనకు వ్యతిరేకమని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధు యాష్కీ ఆరోపించారు. కాంగ్రెస్​అగ్రనేత రాహుల్​ గాంధీ మాత్రం దేశంలో జనాభా లెక్కలతో పాటు కులాలవారీగా లెక్కలు తీయాల్సిన అవసరం ఉందన్నారని ఆయన చెప్పారు. అప్పుడే వారికి సరైన న్యాయం జరుగుతుందన్నది రాహుల్ ఉద్దేశమన్నారు. ఈ నేపథ్యంలో కులగణనకు, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైన బీజేపీకి మద్దతిస్తారో.. లేదా బీసీ అనుకూల కాంగ్రెస్​ను గెలిపిస్తారో.. బీజేపీకి మద్దతిస్తున్న బీఆర్​ఎస్​కు ఓటేస్తారో ప్రజలు నిర్ణయం తీసుకోవాలన్నారు. వంద ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయల్దేరినట్టు.. మాజీ సీఎం, ఆయన కుటుంబ సభ్యులు ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు అమలవుతాయని మధుయాష్కీ చెప్పారు. 

బీసీల కోసం పనిచేస్తూనే ఉంటం: మహేశ్​ కుమార్​ గౌడ్​

బీసీల వాటా కోసం పనిచేస్తూనే ఉంటామని ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ అన్నారు. బీసీ కులగణనపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు. బీసీల హక్కులపై కవిత ఇప్పుడు నిద్రలేచి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తొమ్మిదిన్నరేండ్లు సీఎంగా ఉన్న ఆమె తండ్రి, వివిధ పదవుల్లో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు ఫూలే విగ్రహం గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. మీడియా అటెన్షన్​ కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. బీసీల కోసం పనిచేసేది ఒక్క కాంగ్రెస్​ పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు.