కులాన్ని వెలేశారు

కులాన్ని వెలేశారు

హర్యానాలో పేరులోనే కులం కలిసి ఉంటుంది. ఇది అక్కడ ఎప్పటినుంచో వస్తున్న ఒక సంప్రదాయం. అయితే దీనివల్ల సొసైటీలో క్యాస్ట్​ ఫీలింగ్స్​ పెరుగుతున్నాయని ఆ రాష్ట్రంలోని 24 గ్రామాల ప్రజలు భావించారు. దీనికి చెక్​ పెట్టేందుకు పేరులో కులాన్ని సూచించే పదాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు.కులాన్ని వెలేశారు.

సొసైటీలో కుల పిచ్చి ఎప్పటి నుంచో పాతుకు పోయింది. అవి ఏ రేంజ్​లో ఉంటాయో ప్రతి ఒక్కరికీ లైఫ్​లో ఒక్కసారైనా అనుభవంలోకి వచ్చే ఉంటుంది. చదువుకున్నోళ్లకు, మోటోళ్లకు ఎవరికీ ఈ బాధ తప్పట్లేదు. బిడ్డ పుట్టి భూమ్మీద పడక ముందు నుంచే క్యాస్ట్​ ప్రస్తావన కంపల్సరీగా వస్తోంది. ప్రెగ్నెంట్​ వివరాలు అంగన్​వాడీలోనో ఆశా కార్యకర్త వద్దో రాసేటప్పుడు ఆమెది ఏ కులమో చెప్పాలి. హాస్పిటల్​​లో డెలివరీ అయితే పిల్లల బర్త్​ సర్టిఫికెట్​ కోసం పేరెంట్స్​ క్యాస్ట్​ తెలపాలి.

స్కూల్​లో, కాలేజీలో, యూనివర్సిటీలో చేరేటప్పుడు; చదువు పూర్తయ్యాక జాబ్​కి అప్లై చేసేటప్పుడు.. ఇలా ప్రతి చోటా కులం పేరు రాయాలి. సర్కారు​ పోస్టుకైతే ఇది తప్పనిసరిగా చెప్పాల్సిన విషయం. కొన్ని ప్రైవేట్​ కంపెనీల్లోనూ జాయినింగ్​ రిపోర్ట్​లో సంబంధిత కులం​ ఆప్షన్​ సెలెక్ట్​ చేసుకోవాలి. క్యాస్ట్​ల గోల ఊళ్లల్లో మరీ ఎక్కువ. సిటీల్లో కొందరు ఫలానా క్యాస్ట్​ వాళ్లకు ఇల్లు అద్దెకు ఇవ్వటానికి కూడా ఇష్టపడరు.

తక్కువ కులంవాళ్లు సరిగా చదవరని, వాళ్లకు తెలివితేటలు ఉండవని చాలా మంది అనుకుంటారు. వాళ్లకు రిజర్వేషన్​ వల్లే సీట్లు వస్తున్నాయని, గవర్నమెంట్​ నౌకరీలనూ అలాగే సొంతం చేసుకుంటున్నారని భావిస్తారు. కులం కారణంగా ఎంతో మంది ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారు. టాలెంట్​ ఉన్నా సరైన అవకాశాలు పొందలేకపోతున్నారు. క్యాస్ట్​ వల్ల ఇలా నష్టపోతున్నవారికే ఆ బాధేంటో నిజంగా తెలుస్తుంది. సమాజంలో అసలు ఈ కులాల గొడవే లేకపోతే బాగుండు కదా అని ఆశపడుతుంటారు.

హర్యానాలోని 24 గ్రామాల ప్రజలూ (అన్ని కులాల వాళ్లూ) సరిగ్గా ఇదే ఆలోచించారు. కులం పేరును ఇంటి పేరుగా చెప్పుకునే విధానాన్ని ఇక విడిచిపెట్టాలని నిర్ణయించారు. జింద్​ జిల్లాలోని భుష్లా అనే ఊరులో ఇటీవల సమావేశమై (ఖాప్​ పంచాయతీలో) తీర్మానం చేశారు. నార్తిండియాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమకు తాముగా ఏర్పాటుచేసుకున్న ఈ ఖాప్​ పంచాయతీలు యాక్టివ్​గా పనిచేస్తున్నాయి. చాలా విషయాల్లో ఆ పంచాయతీల పెద్దలు చెప్పిందే వేదం అన్నట్లు నడుస్తోంది.

కావాలంటే ఊరు పేరు పెట్టుకోవచ్చు

‘కులం కొన్నేళ్లుగా ప్రజల్లో ద్వేషాన్ని పెంచుతోంది. దీనివల్ల ఒక్కటిగా ఉండాల్సిన సొసైటీ వర్గాలుగా విడిపోతోంది. అలా జరక్కుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. కులంతో సంబంధం లేకుండా అందరూ ఒక్కటేననే ఆలోచన పెంచటమే మా ఉద్దేశం. ఈ 24 గ్రామాల్లోని జనాలు ఇక నుంచి తమ ఇంటి పేరులో కులం పేరు పెట్టుకోరు. ఇది నచ్చనివాళ్లు, ఇంటి పేరు తొలగించుకోవటానికి ఇష్టపడనివాళ్లు ఊరు పేరుని ఇంటి పేరుగా చేర్చుకోవచ్చు. కులం పేరు ఇంటి పేరుగా ఉండటంతో సమస్యలు వస్తున్నాయి. కులం చూసి ఆ వ్యక్తి గురించి రెండో మాట చెప్పక ముందే ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. స్కిల్స్​ని నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఫలానా కులం వాళ్ల కెపాసిటీ ఇంతేనంటూ ముద్ర వేసేస్తున్నారు. సొసైటీలో నెలకొన్న ఈ సోషల్​ ఫ్యాబ్రిక్​ని సరిచేయటానికే ఈ పని చేశాం’ అని ఖేరా ఖాప్​ హెడ్​ సత్బీర్​ పహల్వాన్​ వివరించారు.

ఇలాంటివే మరికొన్ని నిర్ణయాలు      

ఊళ్లో ఎవరైనా చనిపోతే 13 రోజుల తర్వాత ఖర్మలు చేయటం ఆనవాయితీ. ఆ గ్యాప్​ని 7 రోజులకు తగ్గించింది. తద్దినాల సందర్భంగా ఊళ్లో భోజనాలు పెడతారు. ఈ సంప్రదాయానికి కూడా పంచాయతీ పెద్దలు తెర దించారు. అలాగే యూత్​కి పెళ్లి సంబంధాలు చూసే సమయంలో వాళ్ల తాతముత్తాల గోత్రాల జోలికి వెళ్లొద్దని నిర్ణయించారు. కొన్ని గోత్రాల యువకులకు పిల్లనిచ్చేవాళ్లు దొరక్క పెళ్లిళ్లు కావట్లేదు. దీంతో వంశాల ప్రస్తావన తేకుండా ఉండాలని తీర్మానించారు. పెళ్లిళ్లప్పుడు డీజేలు వాడటాన్నీ బ్యాన్​ చేశారు.

‘ఖట్టర్​’ పేరు​ వాడనన్నసీఎం మనోహర్లాల్​​

హర్యానా సీఎం మనోహర్​లాల్​ ఖట్టర్​ తన పేరులోని ఖట్టర్ అనే ఇంటి పేరును ఇకపై వాడబోనని 2016లోనే తేల్చిచెప్పారు. రిజర్వేషన్లు కోరుతూ జాట్​ సామాజిక వర్గం చేపట్టిన ఆందోళనల్లో 30 మంది ప్రాణాలు కోల్పోవటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘1994 వరకు నేను ఆర్​ఎస్​ఎస్​ వర్కర్​గా పనిచేశాను. అప్పుడు నా కులం ఫలానా అని ఎవరికీ తెలియదు. ఇప్పుడూ ప్రజలు నా పేరు చివరన ఖట్టర్​ అని పలకటం నాకు ఇష్టం ఉండదు. నా పేరు మనోహర్​లాల్​ మాత్రమే. నన్ను గుర్తుపట్టడానికి ఇది చాలు’ అని సీఎం అప్పట్లో అన్నారు. 2004లో సీఎంగా పగ్గాలు చేపట్టిన కొత్తలో కూడా ఆయన ఇలాగే తన ఇంటి పేరు పలికేవారు కాదు.