కులాల వారీగా లెక్కలు తీయాల్సిందే: ఆర్ కృష్ణయ్య

కులాల వారీగా లెక్కలు తీయాల్సిందే:  ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: జన గణనలో కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీల వాటా తమ హక్కు అని, ఎంపీ ఎన్నికల లోపే విధాన ప్రకటన చేయాలని కోరారు. కులగణన చేపట్టాలని, పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బుధవారం జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గువ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ భవన్ నుంచి బషీర్​బాగ్ వరకు బీసీ న్యాయ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. కులగణన కోసం అన్ని ప్రతిపక్ష పార్టీలు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. 

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, రైల్వే, ఎల్ఐసీ, బీహెచ్ఈఎల్, బీడీఎల్, బ్యాంకింగ్, రక్షణ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయొద్దన్నారు. ఈ రెండు ప్రధాన డిమాండ్ల సాధన కోసం 34 రాజకీయ పార్టీలు జులై నెలలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో విస్తృతంగా చర్చించాలని, ప్రభుత్వం దిగిరాకపోతే సమావేశాలను బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.  హనుమంతరావు మాట్లాడుతూ, బీజేపీ బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేసింది కానీ.. దేశంలోని 75 కోట్ల మంది బీసీ ప్రజల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కనీసం ప్రధాని అంగీకరించిన ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. గువ్వల భరత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో అన్ని కులాలు, సామాజిక వర్గాలకు వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ యాత్రలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, వేముల రామకృష్ణ, రాందేవ్ మోడీ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.