
- 12 బెడ్ల ఎమర్జెన్సీ కేర్ యూనిట్ కూడా అందుబాటులోకి
- ప్రారంభించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: తార్నాకలోని టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో గుండె జబ్బులకు సంబంధించిన క్యాథ్‌ల్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్యాథ్‌ల్యాబ్ తో పాటు 12 బెడ్లకు విస్తరించిన ఎమర్జెన్సీ కేర్ యూనిట్‌ను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుక్రవారం ప్రారంభించారు. ఫ్యాక్ట్స్ ఫౌండేషన్ సహకారంతో ఆస్పత్రిలో క్యాథ్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేయగా.. క్రిటికల్ కార్డియక్ కేర్ యూనిట్ ఏర్పాటుకు అశోక్ లేలాండ్ సంస్థ సహకరించింది. అలాగే.. ఎమర్జెన్సీ కేర్ యూనిట్ విస్తరణకు నిర్మాణ్ డాట్ ఓఆర్జీ అనే సంస్థ ద్వారా ఐఓసీఎల్ ఆర్థిక సాయం చేసింది. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ఆర్టీసీ సంస్థ ఆరోగ్యంగా ఉంటుందన్నారు.
అందుకే తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దామని చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా మెరుగైన వైద్య సేవలను ఉద్యోగులకు అందిస్తున్నట్లు తెలిపారు. తార్నాక ఆస్పత్రిలో 2021లో ప్రతి రోజు సగటున 600 అవుట్ పేషెంట్లు రాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 2 వేలకు పెరిగిందని వెల్లడించారు. క్యాథ్‌ల్యాబ్, క్రిటికల్ కార్డియక్ కేర్ యూనిట్, ఎమర్జెన్సీ కేర్ యూనిట్ విస్తరణకు సహకరించిన సంస్థలను సజ్జనార్ అభినందించారు.
కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకన్న, తార్నాక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజా మూర్తి, ఐఓసీఎల్ నుంచి సురజ్ కుమార్, భాస్కర్ రావు, కైలాస్ కాంత్, నిర్మాన్ ఆర్గనైజేషన్ నుంచి శాంతి కుమార్, అనురాధ, ఫ్యాక్ట్స్ ఫౌండేషన్ ఎండీ డాక్టర్ శ్రీనివాస్ కుమార్, అశోక్ లేలాండ్ ప్రతినిధులు నీరేశ్ తివారి, సూర్యనారాయణ, రమేశ్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.