ఆగస్టు నెల సినీ పండగ.. 'కూలీ', 'వార్ 2'ల భారీ పోరుతో బాక్సాఫీస్ షేక్!

ఆగస్టు నెల సినీ పండగ.. 'కూలీ', 'వార్ 2'ల భారీ పోరుతో బాక్సాఫీస్ షేక్!

ఆగస్టు నెల సినీ ప్రియులకు పండగే పండుగ. బాక్సాఫీస్ ను కొల్లగొట్టేందుకు సౌత్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధంగాఉన్నాయి. ముఖ్యంగా బిగ్గెస్ట్ క్లాష్ ఆఫ్ ది ఇయర్ గా చెప్పుకుంటున్న  రజినీకాంత్ ( Rajinikanth ) నటించిన 'కూలీ' ( Coolie ), జూనియర్ ఎన్టీఆర్ (  Jr NTR ), హృతిక్ రోషన్ (  Hrithik Roshan )  ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'వార్ 2' (  War 2 ) ఒకే రోజు తలపడనున్నాయి. ఇవి రెండు ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా సందడి చేయనున్నాయి.  భారీ బడ్జెట్స్ తో  తెరకెక్కిన ఈ రెండు చిత్రాలపై అంచనాలు తారాస్థాయి చేరిఉన్నాయి.  వీటితో పాటు  ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల పూర్తి వివరాలను తెలుసుకుందాం..

ఆగస్టు 1: థ్రిల్లింగ్ ఆరంభం!
ఆగస్టు నెల తొలి రోజే కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు సందడి చేయనున్నాయి. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ సమర్పణలో తెరకెక్కిన కామెడీ-హారర్ చిత్రం 'హౌస్ మేట్స్' (  House Mates )ఆగస్టు 1న విడుదలవుతోంది. టి. రాజా వేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దర్శన్ ( Darshan ) , కాళి వెంకట్ ( Kali Venkat ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక దెయ్యం పట్టిన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్, దాని వల్ల నివాసితులు ఎదుర్కొనే సమస్యల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. హాస్యం, భయం కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. 

అదే రోజు( ఆగస్టు 1 , 2025 ) న జీవీ ప్రకాష్ నటించిన తమిళ చిత్రం 'బ్లాక్‌మెయిల్' ( Blackmail ) కూడా థియేటర్లలోకి వస్తుంది. ము. మారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక థ్రిల్లర్ కావడంతో, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మలయాళంలో, అర్జున్ అశోకన్ నటించిన హారర్ కామెడీ చిత్రం 'సుమతి వలవు' ( Sumathi Valavu ) కూడా ఆగస్టు 1న విడుదల కానుంది. విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైజు కురుప్, బాలు వర్గీస్, శివదా కీలక పాత్రల్లో నటించారు.

ఆగస్టు 14: బిగ్గెస్ట్ క్లాష్ ఆఫ్ ది ఇయర్!
ఆగస్టు 14న బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద యుద్ధమే జరగనుంది. రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కూలీ' అదే రోజున విడుదల కానుంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర రావు, సౌబిన్ షాహిర్, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ వంటి భారీ తారాగణం ఉండటం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. యాక్షన్, డ్రామా, వినోదం కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్‌గా నిలవనుంది.

 

'కూలీ'కి పోటీగా 'వార్2' 
'కూలీ'కి పోటీగా అదే రోజున యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' కూడా వస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. YRF స్పై యూనివర్స్‌లో ఆరో చిత్రమైన 'వార్ 2', 'వార్ (2019)' చిత్రానికి సీక్వెల్. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్న తొలి చిత్రంగా 'వార్ 2'పై తెలుగు ప్రేక్షకుల దృష్టి కూడా ఎక్కువగా ఉంది. ఈ రెండు భారీ చిత్రాల మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది.

 

మాస్ ఎంటర్‌టైనర్స్, ఫీల్-గుడ్ చిత్రాలు!
ఆగస్టు చివరి వారం కూడా కొన్ని ఆసక్తికరమైన విడుదలలకు వేదిక కానుంది. తెలుగు సినిమా మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja ) తన 75వ చిత్రమైన 'మాస్ జాతర' ( Mass Jathara ) తో అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ గణేష్ చతుర్థి వేడుకలకు ముందు, ఆగస్టు 27, 2025న థియేటర్లలోకి వస్తుంది.

మరో వైపు మలయాళంలో, మోహన్‌లాల్( Mohanlal ) నటించిన 'హృదయపూర్వం' ( Hridayapoorvam )చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది. సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్, సంగీత్ ప్రతాప్ కూడా నటించారు. ఇది ఒక ఫీల్-గుడ్ చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మూవీ మేకర్స్ అంచనా వేస్తున్నారు.  కేరళలో ప్రధాన పండగ అయిన ఓనం సందర్భంగా ఆగస్టు 29న, హృదు హరూన్, ప్రీతి ముకుందన్ నటించిన కామెడీ డ్రామా చిత్రం 'మైనే ప్యార్ కియా' ( Maine Pyar Kiya )విడుదల కానుంది.

మొత్తం మీద, ఆగస్టు నెల సినీ ప్రియులకు పండగేనని చెప్పొచ్చు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'కూలీ', 'వార్ 2' పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు భారీగానే ఉన్నాయి.  ఈ నెలలో అటు చిన్న చిత్రాలు కూడా సందడి చేస్తున్నాయి. మరి ఏ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాయో, ఏ సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందుతాయో చూడాలి మరి!