
ఇస్రో ఖాతాలో మరో విజయం.. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన NISAR ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ అయింది. బుధవారం (జూలై30) సాయంత్రం 5.40 గంటలకు ఇస్రో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) -F16 రాకెట్‌లోని నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (నిసార్) ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించారు. ఐదు సంవత్సరాల మిషన్ జీవితకాలంతో మొదటిసారి ఇస్రో, నాసాలు ఉమ్మడిగా భూమి పరిశీలన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. భూమి పర్యావరణ వ్యవస్థలు ,సహజ ప్రమాదాలను ఈ ఉపగ్రహం అధ్యయనం చేస్తుంది. GSLV-F16 మిషన్ కూడా GSLVతో సూర్య సమకాలిక ధ్రువ కక్ష్యకు మొదటి మిషన్.
నిసార్‌లో నాసా నిర్మించిన S-బ్యాండ్ (3.2 GHz) రాడార్లు, L-బ్యాండ్ రాడార్ (1.25 GHz) ఉన్నాయి. భూమిని పరిశీలించే ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్-ఫ్రీక్వెన్సీ రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహంగా నిసార్ నిలిచింది. 2వేల392 కిలోగ్రాముల బరువున్న నిస్సార్ ఉపగ్రహాన్ని నావెల్ స్వీప్‌సార్ టెక్నాలజీని ఉపయోగించి భూమి నుంచి 743 కి.మీ ఎత్తులో కక్ష్యలో ఉంచారు. ప్రతి 12 రోజులకు సెంటీమీటర్-స్థాయి ఖచ్చితత్వంతో మొత్తం గ్రహాన్ని ఇది స్కాన్ చేస్తుంది.
LIVE: We're launching an Earth-observing satellite with @ISRO to map surface changes in unprecedented detail. NISAR will help manage crops, monitor natural hazards, and track sea ice and glaciers.
— NASA (@NASA) July 30, 2025
Liftoff from India is scheduled for 8:10am ET (1210 UTC). https://t.co/M5cECyAAFg
నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (NISAR) ఒక భారత-అమెరికా సంయుక్త ప్రాజెక్టు. ఇది జూలై 30, 2025న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F16 రాకెట్ ద్వారా సాయంత్రం 5:40 గంటలకు ప్రయోగించారు. ఈ మిషన్ సుమారు 1.5 బిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టారు.నిసార్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భూ పరిశీలన ఉపగ్రహం.
నిసార్ మొట్టమొదటి డ్యూయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్ (SAR) ఉపగ్రహం. ఇది ఎల్-బ్యాండ్ (నాసా, 1.25 GHz) ,ఎస్-బ్యాండ్ (ఇస్రో, 3.20 GHz) రాడార్‌లను ఉపయోగిస్తుంది. మేఘాలు, చీకటిని దాటి సెంటీమీటర్ స్థాయిలో భూమి కదలికలను గుర్తిస్తుంది. నిసార్ ఉపగ్రహం బరువు 2వేల392 కిలోగ్రాములు.740 కిలోమీటర్ల ఎత్తులో సూర్యుని కక్ష్యలో (SSO) పరిభ్రమిస్తుంది.
నిసార్ అడ్వాన్స్ డ్ రాడార్ ఇమేజింగ్ ద్వారా భూమి ఉపరితలం, మంచు కవర్‌లను 5-10 మీటర్ల రిజల్యూషన్‌తో నెలకు 4-6 సార్లు కొలుస్తుంది. భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండచరియల వంటి విపత్తులను గుర్తించడం, అధ్యయనం చేస్తుంది. హిమానీనదాలు, అంటార్కిటిక్ క్రయోస్పియర్, తీరప్రాంత సముద్రాల పరిశీలనలో కీలకంగా పనిచేస్తుంది. అధిక-రిజల్యూషన్ చిత్రాలతో వ్యవసాయ పరిశోధనలకు సహకరిస్తుంది.
భారత సరిహద్దుల (చైనా, పాకిస్తాన్) నిఘా, 242 కిలోమీటర్ల వెడల్పుతో ప్రతి 12 రోజులకు భూమి ఫొటోలను సేకరిస్తుంది. శాస్త్రవేత్తలు, రైతులు, విపత్తు నిర్వహణ బృందాలకు ఉచిత డేటా అందిస్తుంది.
మిషన్ విశేషాలు
జీవితకాలం: 5 సంవత్సరాలు.
వ్యయం: ఇస్రో: రూ.788 కోట్లు; నాసా: 808 మిలియన్ల డాలర్లు
ప్రత్యేకత: స్వీప్‌సార్ టెక్నాలజీతో విస్తృత భూ పరిశీలన.
నిసార్ భూమి ఉపరితల ప్రక్రియలను అర్థం చేసుకోవడం, విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది.