
విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) కథానాయకుడుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ 'కింగ్‌డమ్' ( Kingdom ) చిత్రం మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ టికెట్లు హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జూలై 31న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు వెంకటేష్ VP ( Venkatesh VP ) చేసిన ప్రసంగం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు తెరకు తొలిసారి పరిచయం అవుతున్న ఈ నటుడు ఎవరు.. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్న చర్చ ఇప్పుడు చర్చనీయాంశమైంది.. అతని గురించి ఆరా తీస్తున్నారు ప్రేక్షకులు.
భావోద్వేగ ప్రసంగంతో..
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో వెంకటేష్ తన భావోద్వేగ ప్రసంగంతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. అనర్గళంగా తెలుగులో మాట్లాడిన ఆయన, కేరళ మూలాలున్న ఒక సాధారణ నటుడిగా తన తొమ్మిదేళ్ల ప్రయాణాన్ని వివరించారు. మలయాళ టీవీ సీరియల్స్‌లో సహాయ పాత్రలతో మొదలై, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి, ఆపై తమిళ సినిమాలో విలన్‌గా మారి, ఇప్పుడు 'కింగ్‌డమ్'లో కీలక పాత్ర పోషించడం వరకు తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే నేను ఎప్పుడూ కలలు కన్న క్షణం అని వెంకటేష్ అన్నారు. ఏదో ఒక రోజు నేను గొప్ప వ్యక్తిని కావాలని ఆశిస్తున్నాను. నాకు నేనే గర్వపడుతున్నాను. నిర్మాతలు, దర్శకులు, దయచేసి నన్ను పరిగణనలోకి తీసుకోండి. నేను మళ్ళీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి పని చేయాలని ఆశిస్తున్నాను, కానీ ఈసారి హీరోగా!" అని తన ప్రసంగించారు.
'మురుగన్' పాత్రలో..
'కింగ్‌డమ్' చిత్రంలో వెంకటేష్ 'మురుగన్' అనే పాత్రలో నటించారు. సినిమా విడుదలకు ముందే విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో వెంకటేష్‌ను అభిమానులకు పరిచయం చేస్తూ, ఆయన అద్భుతమైన నటనను ప్రశంసించారు: "ప్రపంచానికి నేను @venkitesh_vpని, 'మురుగన్'ని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇది ఆయనకు నాలుగో సినిమా మాత్రమే అయినప్పటికీ, ఆయన నన్ను తన ప్రపంచంలోకి తీసుకెళ్ళారు. మధురమైన ఆత్మ, తీక్షణమైన కళ్ళు, అద్భుతమైన శక్తితో ఈ నటుడు చాలా శక్తివంతమైనవాడు. ఆయన శాశ్వత ముద్ర వేస్తాడు అని విజయ్ దేవరకొండ ప్రశంసలు కురిపించారు.
'సుడా సుడా ఇడ్లీ' ఫుడ్ ట్రక్
నటుడు వెంకటేష్ ఆఫ్-స్క్రీన్ జీవితం మరింత ఆసక్తికరంగా ఉంది. 2024లో, ఆయన తన స్నేహితులతో కలిసి త్రివేండ్రంలో 'సుడా సుడా ఇడ్లీ' అనే స్ట్రీట్ ఫుడ్ ట్రక్‌ను ప్రారంభించారు. అక్కడ వేడివేడి, తాజాగా చేసిన ఇడ్లీలను అందిస్తున్నారు. వెంకటేష్ స్వయంగా ఇడ్లీలు వండి, సర్వ్ చేస్తూ, ఆర్డర్లు తీసుకుంటుంటారు. ఈ ట్రక్ మంగళవారం నుండి ఆదివారం వరకు రాత్రి 7:25 నుండి 10 గంటల వరకు నడుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రజనీకాంత్ వీరాభిమాని అయిన వెంకటేష్, 'కింగ్‌డమ్'లో తన తెలుగు అరంగేట్రాన్ని తన తల్లి తారకు అంకితం చేశారు. గతంలో ఆయన జీవీ ప్రకాష్ కుమార్ నటించిన తమిళ చిత్రం 'రెబెల్' (2024) , మమ్ముట్టితో కలిసి 'ది ప్రీస్ట్' (2021) చిత్రాల్లో నటించారు. ఇప్పుడు 'కింగ్ డమ్' మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. 'గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించి ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాలకాలపై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జూలై 31న భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.