
శ్రీవాణి దర్శనం టికెట్ల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ రోజుకారోజు శ్రీవాణి దర్శన టికెట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఆగస్టు 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది టీటీడీ. శ్రీవాణి దర్శన టికెట్లు ఆఫ్ లైన్లో తీసుకొని దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. బుధవారం ( జులై 30 ) తిరుమలలోని గోకులం కాన్ఫరెన్స్ హాల్ లో శ్రీవాణి దర్శనాలపై సమీక్ష నిర్వహించిన వెంకయ్య చౌదరి ఈమేరకు నిర్ణయాన్ని ప్రకటించారు.
శ్రీవాణి దర్శనం విషయంలో ప్రస్తుతం విధానం వల్ల సదరు టికెట్ దర్శనం కోసం భక్తులు సుమారు మూడు రోజుల వేచి ఉండాల్సి వస్తోందని.. వారి సౌకర్యం కోసం ఏ రోజుకారోజు టికెట్ జారీ చేసి దర్శనం కల్పించాలని నిర్ణయించింది టీటీడీ. ఆగస్టు 1 నుంచి 15 వరకు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. తిరుమలలో ఉదయం 10 గంటల నుండి మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన టికెట్ల జారీ చేయాలని.. టికెట్లను పొందిన శ్రీవాణి భక్తులకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 దగ్గర అదే రోజు సాయంత్రం 4 :30 గంటలకు రిపోర్టింగ్ టైం ఇవ్వాలని తెలిపింది టీటీడీ.
రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుండి దర్శన టికెట్లు కోటా ఉన్నంతవరకు ఇవ్వాలని.. యథావిధిగా తిరుమలలో ఆఫ్ లైన్ ద్వారా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆక్టోబర్ 31వ తేది వరకు ఆన్ లైన్ లో శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతిచనున్నట్లు తెలిపింది టీటీడీ.
నవంబర్ 1వ తేది నుండి శ్రీవాణి టికెట్లను ఆఫ్ లైన్, ఆన్ లైన్ టికెట్లు పొందిన భక్తులకు సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతివ్వనున్నట్లు తెలిపింది. భక్తులు ముందుగా కౌంటర్ల దగ్గరకు చేరుకుని తాము ఇబ్బంది పడకుండా ఉదయం 10 గంటలకు మాత్రమే తిరుమలలోని శ్రీవాణి టికెట్ జారీ కేంద్రానికి చేరుకోవాలని కోరింది టీటీడీ. ఈ నూతన విధానం తో భక్తులు శీఘ్రంగా అనగా వచ్చిన రోజునే దర్శనం చేసుకునే వెసులుబాటుని గ్రహించ గలరు.