
'మహావతార్ నరసింహ' ( Mahavatar Narsimha ) బాక్సాఫీస్ వద్ద గర్జిస్తుంది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు ఇండియాలో రూ. 1.75 కోట్లు వసూలు చేసింది. పాజిటివ్ టాక్ రావడంతో రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ ఐదు రోజుల్లోనే దాదాపు రూ. 30 కోట్ల మేర రాబట్టింది. ఒక్క హిందీ వెర్షన్ నుంచి రూ. 20.65 కోట్లు కొల్లగొట్టేసిందని ట్రేడ్ వెబ్సైట్ సక్నిల్క్ తెలిపింది.. మంగళవారం ( జూలై 29, 2025 ) ఒక్క రోజే రూ. 7.41 కోట్లు ఆర్జించిందంటే ఈ మూవీ క్రేజ్ ఎలా పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు.
సలార్ , కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ యానిమేటెడ్ యాక్షన్ డ్రామా ' మహావతార్ నరసింహ'తో మరో బ్లాక్ బస్టర్ ను అందించింది. విడుదలైనప్పటి నుంచీ అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతున్న ఈ యానిమేషన్ చిత్రం, విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ అద్భుతమైన ఆదరణ పట్ల చిత్ర బృందం, ముఖ్యంగా నిర్మాతలు, తమ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
'మహా అవతార్ నరసింహ' కేవలం ఒక యానిమేషన్ చిత్రం కాదు, ఇది ఒక సాంస్కృతిక సంచలనం. 2005 తర్వాత బాక్సాఫీస్ వద్ద ఇంతటి ప్రభంజనం సృష్టించిన తొలి యానిమేషన్ చిత్రంగా నిలిచి, సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఈ చిత్రం సాధించిన విజయం పట్ల చిత్ర బృందం ఎంతో భావోద్వేగానికి లోనైంది. కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులతో ఈ చిత్రం ఒక లోతైన ఆధ్యాత్మిక, భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకుందని తెలిపారు.
ALSO READ : సంచలనం సృష్టించిన మర్డర్ కేసుపై సినిమా: టైటిల్ అనౌన్స్.. మేఘాలయ హనీమూన్ కిల్లింగ్ స్టోరీ ఇదే!
హోంబలె ఫిలిమ్స్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, "సినిమా విశ్వాసాలకు వేదికైనప్పుడు... #MahavatarNarsimha ధర్మశక్తితో భారతదేశం అంతటా హృదయాలను ఏకం చేసింది. మీ దగ్గర్లోని సినిమా హాళ్లలో దివ్య దర్శనం చూడండి" అని పంచుకుంది. ఇది కేవలం ఒక సినిమా అనుభవం కాదని, ఒక ఆధ్యాత్మిక అనుభూతి అనీ, భక్తి, పురాణాలు, ధర్మం యొక్క సారాంశాన్ని దాని చిత్రీకరణతో ప్రేక్షకులను ఆకర్షించి, ఒక సాంస్కృతిక ఉద్యమంగా మారిందని పోస్ట్ చేశారు.
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో, శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ ల నిర్మాణం లో క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 'మహా అవతార్ నరసింహ' రూపుదిద్దుకుంది. అద్భుతమైన విజువల్స్, గొప్ప సంస్కృతి, ఉన్నతమైన నాణ్యత, లోతైన కథనంతో ఈ చిత్రాని 3D, 2Dలో జూలై 25, 2025న ఐదు భాషలలో విడుదల అయ్యింది.
హోంబలె ఫిలిమ్స్ , క్లీమ్ ప్రొడక్షన్స్ రాబోయే దశాబ్ద కాలానికి సంబంధించిన తమ ప్రతిష్టాత్మక యానిమేషన్ ఫ్రాంచైజీ లైనప్‌ను కూడా వెల్లడించింది. మహా అవతార్ పరశురామ్ (2027), మహా అవతార్ రఘునందన్ (2029), మహా అవతార్ ద్వారకాధీష్ (2031), మహా అవతార్ గోకులనంద (2033), మహా అవతార్ కల్కి పార్ట్ 1 (2035), మహా అవతార్ కల్కి పార్ట్ 2 (2037). ఈ యానిమేషన్ ఫ్రాంచైజీ భారతీయ ఆధ్యాత్మికతను, పౌరాణిక కథలను ప్రపంచానికి చాటి చెప్పడంలో కీలక పాత్ర పోషిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.