మిస్టరీ కేసుల ఛేదనలో క్లూస్ టీం కీరోల్

మిస్టరీ కేసుల ఛేదనలో క్లూస్ టీం కీరోల్

నేరం జరిగిన చోట పోలీసులు ముందుగా వెతికేది క్లూస్​కోసమే. వారికి చిక్కకుండా ఉండేందుకు క్రిమినల్స్ పక్కా ప్లాన్ తో ఎస్కేప్ అవుతుంటారు. మర్డర్, కిడ్నాప్, దోపిడీ.. ఎలాంటి కేసులోనైనా సరే సీన్ ఆఫ్ అఫెన్స్ లో తమ ఆనవాళ్లు లేకుండా చూసుకుంటారు. మర్డర్ కేసుల్లో అయితే ఆయుధాల దగ్గర్నుంచి ట్రాన్స్ పోర్టేషన్ వరకు ఎవిడెన్సును డైల్యూట్ చేస్తుంటారు. కానీ ఎంతటి మిస్టరీ కేసులోనైనా సీన్ ఆఫ్ అఫెన్స్ లో దొరికే చిన్న ‘క్లూ’తోనే పోలీసులు కేసులను ఛేదిస్తుంటారు. మర్డర్లు, దోపిడీ, కిడ్నాపులు.. ఎలాంటి కేసులోనైనా సరే పక్కా క్లూస్ సేకరించి మిస్టరీలను ట్రేస్ చేయడంలో క్లూస్ టీమ్​ ప్రధాన పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన 17 క్లూస్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మొత్తం 60 మంది క్రైమ్ సీన్ ఆఫీసర్లు, మరో 30 మంది అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో టీమ్ లో 5 నుంచి 10 మంది వరకు సైన్స్ నిపుణులు ఉన్నారు. వీళ్లు సీన్ ఆఫ్ అఫెన్స్ లో లభించే క్లూస్ ను కలెక్ట్ చేయడం, భద్రపరచడం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించడం వంటివి చేస్తుంటున్నారు. క్లూస్ సేకరణలో ప్రత్యేక అనుభవం పొందిన నిపుణులు సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఫింగర్ ప్రింట్స్ తో పాటు అక్కడ లభించే ఫుట్ ప్రింట్స్, బట్టలు, బ్లడ్ శాంపుల్స్ ను స్పెషల్ కెమికల్ బాక్సుల్లో భద్రపరుస్తారు.

అత్యాధునిక పరికరాలతో….

ఏదైనా క్రైమ్ జరిగిన చోటుకు ముందుగా సీన్ ఆఫ్ అఫెన్స్ కు చేరుకునే పోలీసులు క్రైమ్ సీన్ లో ఎలాంటి వస్తువును టచ్ చేయరు. నేరం జరిగిన చోట ముందుగా క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుంది. సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఫింగర్ ప్రింట్స్ తో పాటు అక్కుడున్న బ్లడ్ శాంపిల్స్, నేరానికి ఉపయోగించిన మెటీరియల్ కలెక్ట్ చేస్తారు. క్రైమ్ సీన్ లో అనుమానాస్పదంగా కనిపించే ప్రతీ వస్తువును అధునాతన పరికరాలతో పరిశీలిస్తారు. ఘటనా స్థలాన్ని వీడియో, ఫొటో కెమెరాలతో రికార్డు చేస్తారు. దీనికి హెడెఫినేషన్ కెమెరాలను క్లూస్ టీమ్ ఉపయోగిస్తోంది. ఘటన స్థలంలో ఏ చిన్న క్లూ దొరికినా దాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్​సైన్స్​ల్యాబ్​(ఎఫ్​ఎస్​ఎల్​) కు పంపిస్తారు. కొన్ని హత్య కేసుల్లో ప్రొఫెషనల్ క్రిమినల్స్ డెడ్ బాడీలను తగులబెట్టడం, ముక్కలు ముక్కలుగా చేయడంతో పోలీసుల దర్యాప్తులో అనేక సవాళ్లు ఎదురౌతాయి. ఇలాంటి కేసుల్లో క్లూస్ టీమ్ సేకరించే చిన్న చిన్ని క్లూస్​దర్యాప్తులో కీలకంగా ఉంటాయి. బాంబ్ బ్లాస్ట్స్, అగ్ని ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు జరిగిన ప్రాంతాల్లో సేకరించే బ్లడ్ శాంపిల్స్, పేలుడు పదార్థాలను జాగ్రత్తగా సేకరిస్తారు. వీటిని సైంటిఫిక్ ఆధారాలతో నిర్ధారించుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో నేరస్తులకు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

ఉప్పల్​ నరబలి కేసులో….

2017లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉప్పల్ చిలుకానగర్ నరబలి కేసులో రక్తపు చుక్కలే నిందితుడిని పట్టించాయి. ఫిబ్రవరి 1న ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన నరబలి కేసులో నిందితుడైన రాజశేఖర్ పథకం ప్రకారం చిన్నారి తల నరికి నరబలి ఇచ్చాడని క్లూస్ టీమ్ సాక్ష్యాలు సేకరించింది. ఈ కేసులో అల్ట్రా వాయిలెట్‌‌ లైట్‌‌ పరిజ్ఞానంతో తయారు చేసిన ‘సూపర్ లైట్’ నిందితుడి అకృత్యాన్ని పసిగట్టింది. క్లూస్ టీమ్ హెడ్  డా.వెంకన్న సూపర్‌‌లైట్‌‌ తో జరిపిన తనిఖీలతో కేసు మిస్టరీ వీడింది. టైల్స్ మధ్యలో సూపర్ లైట్ గుర్తించిన రక్తపు చుక్కలు శిశువు మెడకు ఉన్న రక్తపు మరకలను డీఎన్‌‌ఏతో విశ్లేషించి ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేసి మిస్టరీని ఛేదించారు.

ఓయూ విద్యార్థి ఆత్మహత్య కేసులో….

2017 డిసెంబర్ 3 న ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ విద్యార్థి మురళి ఆత్మహత్య అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. సిద్దిపేట జిల్లా దౌలాపూర్ కు చెందిన మురళి ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు ముందు సూసైడ్‌‌ నోట్‌‌ కూడా రాశాడని, అసలు నోట్ ను పోలీసులు మాయం చేసి వేరే సూసైడ్‌‌ నోట్‌‌ను పెట్టారని విద్యార్థి సంఘాలు ఆందోళకు దిగాయి. మురళి రూమ్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ ను క్లూస్ టీమ్ పరిశీలించింది. నోట్ పై రాసిన అక్షరాలను మృతుడి హ్యాండ్ రైటింగ్ ను సాంకేతిక పరికరాలతో చెక్ చేసింది. సూసైడ్ నోట్ లోని అక్షరాలు మురళి చేతి రాతను సరి పోలాయి. దీంతో సూసైడ్ నోట్ పై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి.

చిన్న వెంట్రుకైనా చాలు..

హైదరాబాద్ క్లూస్ టీమ్ లో 90 మందిమి ఉన్నాం. 17 టీమ్స్ 24 గంటలు పోలీసులకు అందుబాటులో ఉంటాయి. నేరం జరిగిన ప్రాంతాన్ని డిస్టర్బ్ చేయొద్దు. క్రైమ్ సీన్ మొత్తం అత్యాధునిక పరికరాలతో పరిశీలిస్తాం. కేసు చిక్కుముడి విప్పడానికి చిన్న వెంట్రుక దొరికినా చాలు. ఉప్పల్ నరబలి కేసులో కంటికి కనిపించని రక్తపు చుక్కను గుర్తించాం. ఇలా మిస్టరీగా మారిన వాటిలో మా క్లూస్ తో పోలీసులు కేసులను ఛేదిస్తున్నారు.