జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సీరియ‌స్ కామెంట్స్: సీబీఐలో క‌ద‌లిక‌.. ఇద్ద‌రి అరెస్ట్

V6 Velugu Posted on Aug 08, 2021

జ‌డ్జిల‌కు బెదిరింపులు వ‌స్తున్నా వాటిని ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీలు ప‌ట్టించుకోవ‌డం లేదు. కంప్లైంట్ చేసినా సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో లాంటి సంస్థ‌లు రెస్పాండ్ కావ‌డం లేదు. జ‌డ్జిల‌కు ర‌క్ష‌ణ క‌రువ‌వుతోంది అంటూ సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ రెండ్రోజుల క్రితం ఓ కేసు విచార‌ణ సంద‌ర్భంగా సీరియ‌స్ కామెంట్లు చేశారు. ఆయ‌న ఆవేద‌న మొత్తానికి సీబీఐలో చ‌ల‌నం తీసుకొచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు జ‌డ్జిల‌ను టార్గెట్ చేస్తూ, వాళ్లు ఇచ్చే తీర్పుల‌కు దురుద్దేశాల‌ను ఆపాదిస్తూ కొంత‌మంది సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డంపై గ‌తంలో సీబీఐ ద‌ర్యాప్తుకు ఆదేశాలించ్చింది అదే హైకోర్టు. గ‌త ఏడాది న‌వంబ‌ర్ నుంచి న‌డుస్తున్న‌ ఈ కేసు పురోగ‌తి అంత వేగంగా లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఎలాంటి పోస్టులు చేశారు, ఏ సోష‌ల్ మీడియా ఐడీలతో వాటిని పోస్టింగ్ చేశార‌న్న విష‌యాల‌ను కూడా హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి సీబీఐకి అందాయి. అయితే వాటి ఆధారంగా మొత్తం 16 మందిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన సీబీఐ అధికారులు సుదీర్ఘ ద‌ర్యాప్తు త‌ర్వాత వారిలో ముగ్గురు విదేశాల్లో ఉన్న‌ట్టు తేల్చారు. దాదాపు తొమ్మిది నెల‌ల తర్వాత గ‌త నెల 9న ఈ కేసులో తొలి అరెస్టు జ‌రిగింది. ముగ్గురు నిందితుల‌ను గుర్తించి సీబీఐ అరెస్టు చేసింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సుమారు నెల స‌మ‌యం తీసుకుని నిన్న (ఆగ‌స్టు 7న‌) మ‌రో ఇద్దరిని అరెస్టు చేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఐదురుగురిని మాత్ర‌మే అరెస్టు చేయ‌గా, మిగిలిన 11 మందిపై ఇంకా ఎటువంటి చ‌ర్య‌లు లేదు. అయితే ఈ తాజా అరెస్టు సీజేఐ కామెంట్స్ త‌ర్వాత జ‌ర‌గ‌డంతో సీబీఐ తీరులో మార్పు వచ్చిందా అన్న చ‌ర్చ న్యాయ‌వ‌ర్గాల్లో న‌డుస్తోంది. 

జార్ఖండ్ జ‌డ్జి హ‌త్య కేసు విచార‌ణ‌లో..

జార్ఖండ్‌కు చెందిన ఒక జిల్లా జడ్జి ఉత్త‌మ్ ఆనంద్ (49) అనేక మాఫియా హత్య కేసుల‌పై విచార‌ణ చేస్తున్నారు. ఆయ‌న గ‌త నెల‌లో ఇద్ద‌రు గ్యాంగ్‌స్ట‌ర్స్ బెయిల్ పిటిష‌న్ల‌ను తిర‌స్క‌రించారు. ఈ క్ర‌మంలో జులై 28న ధ‌న్‌బాద్‌లో న‌డి రోడ్డుపై ఆయ‌న‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆటోతో గుద్దించి చంపేశారు. ఈ కేసుకు సంబంధించిన విచార‌ణ సుప్రీం కోర్టులో శుక్ర‌వారం నాడు (ఆగస్టు 6న) జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సుప్రీం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ సీరియ‌స్ కామెంట్లు చేశారు. జ‌డ్జిల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌ని, త‌మ‌కు బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని సీబీఐ, ఐబీల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌నిఆయ‌న అన్నారు. సీబీఐ ఏం చేయ‌డం లేద‌ని, ఆ సంస్థ తీరులో తాము కొంత మార్పును ఆశించామ‌ని, కానీ ఏ మార్పు లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలా చెప్పాల్సిరావ‌డం బాధాక‌ర‌మ‌ని, కానీ బ‌య‌ట ప‌రిస్థితి అలా ఉంద‌ని అన్నారు. సీబీఐ నుంచి జ‌డ్జిల‌కు ఎటువంటి సాయం అంద‌డం లేద‌ని, వారి నుంచి కొంత  స‌పోర్ట్ ఉండే బాగుంటుంద‌ని, తాను బాధ్య‌తాయుతంగా ఆలోచించే ఈ కామెంట్స్ చేస్తున్నాన‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. జ‌డ్జిలకు ర‌క్ష‌ణ క‌ల్పించే అంశానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పిటిష‌న్ల‌పై స్పందించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశిస్తూ, వారం రోజుల గ‌డువు ఇచ్చారు. సీజేఐ పై కామెంట్స్ చేసిన త‌ర్వాతి రోజే సీబీఐ అధికారులు.. జడ్జిల‌కు సంబంధించిన కేసులో ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్టు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

Tagged arrest, cbi, Chief Justice, social media posts, NV Ramana, Targeting High Court Judges

Latest Videos

Subscribe Now

More News