భోపాల్: నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్విషా శర్మ అత్త, మాజీ జడ్జి గిరిబాల సింగ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే గిరిబాల సింగ్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. దాదాపు ఆరున్నర గంటల పాటు విచారించిన అనంతరం సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది.
అనుమానస్పద స్థితిలో ట్విషా శర్మ మృతి..!
నటి, మోడల్ ట్విషా శర్మ 2026, మే 12న భోపాల్‌లోని తన అత్తగారింట్లో అనుమానస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. న్యాయవాది సమర్థ్ సింగ్‌తో వివాహం జరిగిన కేవలం ఐదు నెలలకే అత్తగారింట్లో ఉరి వేసుకుని శవమై కనిపించింది. ట్విషా మరణంపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ట్విషాను ఆమె భర్త, అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని.. ఇది వరకట్నం కోసం జరిగిన హత్య అని ఆరోపిస్తున్నారు.
దీంతో ట్విషా అత్త, మాజీ జడ్జి గిరిబాల సింగ్ కోర్టును ఆశ్రయించారు. భోపాల్ సెషన్స్ కోర్టులో ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. భోపాల్ సెషన్స్ కోర్టు గిరిబాల సింగ్‌కు యాంటిస్పేటరీ బెయిల్ ఇచ్చింది. సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ట్విషా ఫ్యామిలీ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది.
మధ్యప్రదేశ్ హైకోర్టు గిరిబాల సింగ్ ముందస్తు బెయిల్‌ను రద్దు చేసింది. హైకోర్టు యాంటిస్పేటరీ బెయిల్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే ఈ కేసును విచారిస్తోన్న సీబీఐ గిరిబాల సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించి అనంతరం అరెస్ట్ చేసింది.
