మాజీ సీబీఐ ఆఫీసర్పై CBI ఆరా!

మాజీ సీబీఐ ఆఫీసర్పై CBI ఆరా!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో హైదరాబాద్ లో ఉండే మాజీ సీబీఐ ఆఫీసర్ తీరుపై సీబీఐ ఆరా తీస్తునట్టు సమాచారం. రాష్ట్రంలోని కొందరు ముఖ్య నేతలు, ప్రముఖులకు లింకున్న ఈ కేసులో కొన్ని నెలలుగా రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కొందరికి నోటీసులిచ్చి వారి నుంచి స్టేట్ మెంట్లను కూడా రికార్డు చేసింది. ఇంకా లోతుగా ఎంక్వైరీ జరగాల్సి ఉంది. అయితే ఈ కేసులో ప్రమేయం ఉన్న ముఖ్య నేతలకు, ప్రముఖులకు ఓ మాజీ CBI అధికారి సహకారం అందిస్తున్నారని దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇట్లాంటి కేసుల్లో CBI దర్యాప్తు, ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, ఎంక్వైరీలో ఎట్లాంటి ప్రశ్నలు వేస్తారు, వాటికి ఎట్లా స్పందించాలి, జవాబులిచ్చే విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దర్యాప్తు ఆఫీసర్లతో ఎట్లా వ్యవహరించాలి, కేసులో దొరకకుండా ఎట్లా మాట్లాడాలన్న అంశాలపై నోటీసులు అందుకున్న లీడర్లకు మాజీ అధికారి ట్రెయినింగ్ ఇస్తున్నట్లు సమాచారం. 

సర్వీస్ రూల్స్ తప్పారా?

మాజీ అధికారి విషయం సీబీఐ దృష్టికి పోవడంతో అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇది కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నంగా భావిస్తున్నారు. దీంతో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలపై దృష్టిపెట్టినట్లు సమాచారం. నిజానికి దర్యాప్తు సంస్థల్లో పనిచేసే అధికారులు డ్యూటీకి సంబంధించిన సమాచారం బయటికి చెప్పేందుకు వీలులేదు. సర్వీసు రూల్స్ లో దీనికి సంబంధించి కచ్చితమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ముఖ్యంగా కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ఏ విషయాలను కూడా సర్వీసులో ఉన్నప్పుడు గానీ, రిటైరైన తర్వాతగానీ బయటపెట్టడం నిబంధనలకు వ్యతిరేకం. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులో సంబంధం ఉన్న రాజకీయ ప్రముఖులకు మాజీ ఆఫీసర్ ట్రైనింగ్ ఇవ్వడాన్ని సీబీఐ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.