
లేహ్/న్యూఢిల్లీ: లడఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ అమలు కోసం డిమాండ్‌చేస్తూ ఆందోళన చేపట్టిన ప్రముఖ విద్యావేత్త, యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభించింది. వాంగ్‌చుక్ స్థాపించిన హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడఖ్(హెచ్ఐఏఎల్) సంస్థకు సంబంధించి విదేశీ నిధుల చట్టం(ఎఫ్సీఆర్ఏ) ఉల్లంఘన జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ఈ దర్యాప్తు చేస్తోంది. అలాగే, వాంగ్‌చుక్ ఈ ఏడాది ఫిబ్రవరి 6న పాకిస్తాన్ సందర్శనకు వెళ్లిన అంశాన్ని కూడా సీబీఐ పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు.
ఈ ఎంక్వైరీని రెండు నెలల క్రితమే సీబీఐ మొదలుపెట్టింది. ఆగస్టులో లడఖ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఐఏఎల్కు కేటాయించిన భూమిని రద్దు చేసింది. దీనిపై తీవ్ర వివాదం చెలరేగింది. మరోవైపు వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షలో మంగళవారం రాత్రి దీక్షలో ఉన్న 15 మందిలో ఇద్దరి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఆందోళనల్లో 80 మంది గాయపడ్డారు. అందులో 40 మంది పోలీసులు ఉన్నారు. వాంగ్‌చుక్ ప్రకటనలతోనే హింస జరిగిందని కేంద్రం ఆరోపించింది. అలాగే, వాంగ్‌చుక్ స్థాపించిన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ ఎన్జీవో నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్‌ను కేంద్రం రద్దు చేసింది.
లేహ్‌లో కర్ఫ్యూ.. 50 మంది అరెస్ట్
లడఖ్‌లో బుధవారం నాటి హింసాత్మక ఘటనలకు సంబంధించి 50 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామున పోలీసులు, పారామిలిటరీ బలగాలు పెద్ద ఎత్తున సోదాలు చేపట్టాయి. ఈ సోదాల్లో అల్లర్లలో పాల్గొన్న వారిని గుర్తించి అరెస్ట్ చేశారు. అలాగే, లేహ్‌లో కర్ఫ్యూ విధించారు. కార్గిల్‌తో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు.
బలి పశువును చేయాలని చూస్తున్నరు: వాంగ్‌చుక్
లడఖ్‌లో హింసాత్మక ఘటనలకు తానే కారణమన్న హోం శాఖ ఆరోపణలను వాంగ్‌చుక్ ఖండించారు. ఇది సమస్యలను పరిష్కరించకుండా.. తనను బలిపశువును చేయడానికి జరుగుతున్న కుట్ర అని అన్నారు. ఈ ఘటనలు తన వల్ల జరిగాయని ఒకసారి, కాంగ్రెస్‌వల్ల జరిగాయని మరోసారి కేంద్రం ప్రకటించడం.. సమస్యను పక్కదారి పట్టించడమేనని మండిపడ్డారు. అలాగే, తన ఎన్జీవోకు విదేశీ నిధుల లైసెన్స్ ను రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. తన ఎన్ జీవో, హెచ్ఐఏఎల్ ఉచిత విద్యా సంస్థలు అని.. అవి డొనేషన్లు కాదని.. సర్వీస్ అగ్రీమెంట్లని వాంగ్‌చుక్ పేర్కొన్నారు.