లిక్కర్ స్కాం : బోయిన్​పల్లి అభిషేక్​కు బెయిల్ ఇవ్వొద్దు

లిక్కర్ స్కాం : బోయిన్​పల్లి అభిషేక్​కు బెయిల్ ఇవ్వొద్దు
  • ప్రత్యేక కోర్డును కోరిన సీబీఐ అధికారులు
  • సాక్ష్యాలు తారుమారు చేసే చాన్స్ ఉందని వివరణ
  • 14 న ఉత్తర్వులు ఇస్తామన్న బెంచ్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్​పల్లికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. ఈ కేసులో కీలక వ్యక్తి దినేశ్ అరోరా అఫ్రూవర్​గా మారారని, విచారణ జరుపుతున్నామని కోర్టుకు వివరించారు. ఇలాంటి పరిస్థితిలో నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కేసులో ఇప్పటికే రిమాండ్​లో ఉన్న ఉన్న విజయ్, అభిషేక్.. తమకు బెయిల్ ఇవ్వాలంటూ సీబీఐ స్పెషల్ కోర్టును ఆశ్రయించగా బుధవారం విచారణ జరిగింది. 

మంత్రులను ప్రశ్నించరెందుకు?

లిక్కర్ స్కాంలో సంబంధం లేని వ్యక్తిని అరెస్ట్ చేసి 47 రోజులుగా అధికారులు విచారిస్తున్నారని విజయ్ నాయర్ తరఫు లాయర్ రెబెకా జాన్ బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. ఆబ్కారీ శాఖ అధికారులను, మంత్రులను మాత్రం ప్రశ్నించలేదన్నారు. ఆగస్టు 19న, సెప్టెంబర్ 6 న రెండుసార్లు విజయ్ నాయర్ నివాసంలో సోదాల్లో ఏమీ దొరకలేదని వివరించారు. నాయర్ దర్యాప్తునకు సహకరిస్తున్నారని నివేదించారు. అందువల్ల ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. 

లోగో కొన్నంత మాత్రాన కంపెనీ షేర్లున్నట్లా?

నెల రోజుల నుంచి రిమాండ్​లో ఉన్న బోయిన్​పల్లి అభిషేక్​పై నగదు లావాదేవీల ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, ఆయనకు బెయిల్ ఇవ్వాలని అభిషేక్ తరపు లాయర్ శ్రీసింగ్  కోర్టును కోరారు. దీనిపై జోక్యం చేసుకున్న జడ్జి నాగ్ పాల్..  చివరకు నగదు లావాదేవీలు జరిగాయి కదా? అని వ్యాఖ్యానించారు. అయితే, తన క్లైంట్​కు ఆంధ్రప్రభ పబ్లికేషన్స్​తో ఎలాంటి సంబంధాలు లేవని, ఎలాంటి వాటాలు లేవని లాయర్ వివరించారు. పబ్లికేషన్స్ ఖాతాలో జమయిన రూ. 1.75 కోట్లకు.. తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ సబ్సిడరీ అయిన ఇండియా ఎహెడ్ చానల్ లోగోను కొన్నంత మాత్రాన ఆ కంపెనీలో షేర్లు ఉన్నాయనడం సరికాదని వాదనలు వినిపించారు. 

ఉద్యోగులకు డబ్బులు పంచిన్రు: సీబీఐ

లిక్కర్ పాలసీ రూపకల్పనలో విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించారని, ఢిల్లీ మంత్రుల వద్ద సమాచారం తీసుకుని వ్యాపారస్తులకు ఇచ్చారని సీబీఐ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. హవాలా మార్గాల్లో డబ్బులు ఇచ్చారని, హైదరాబాద్, ఢిల్లీలో సమావేశాలు పెట్టారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు పంపిణీ చేశారని వివరించారు. ఎల్–1 షాపులకు 12% కమీషన్ ఇచ్చి, తిరిగి 6% తీసుకునేలా ఒప్పందం జరిగిందని వాదించారు. అన్ని వైపులా వాదనలు ముగిసిన తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు..  అభిషేక్, విజయ్ నాయర్ ల బెయిల్ పిటిషన్ పై నవంబర్ 14 న ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించింది.