
Reliance Communication: కొన్ని వారాల కిందట అనిల్ అంబానీకి సంబంధించిన స్థలాలు ఆయన సంస్థల మాజీ ఉద్యోగులపై సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి అనిల్ అంబానీకి సంబంధించిన ప్రాంతాలు, అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్ ఆఫీసులపై సీబీఐ అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. బ్యాంక్ రుణాలకు సంబంధించిన మోసం విషయంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే కేసుకు సంబంధించిన వివరాలను ప్రస్తుతం షేర్ చేయలేదు సీబీఐ అఫీషియల్స్.
ఇటీవల ఈడీ అధికారులు కూడా అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనిల్ అంబానీపై రూ.17వేల కోట్ల బ్యాంక్ రుణాల మోసానికి సంబంధించిన కేసు ముమ్మరంగా విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫైనాన్షియల్ ప్రోబ్ ఏజెన్సీ రిక్వెస్ట్ మేరకు ఈ నోటీసు జారీ అయ్యింది. ముందస్తు అనుమతులు లేకుండా దేశం విడిచి అనిల్ అంబానీ వెళ్లకుండా నిరోధించేందుకు దీనిని జారీ చేశారు దర్యాప్తు అధికారులు.
ఈ నెల మెుదటి వారంలో అనిల్ అంబానీ దర్యాప్తుకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కంపెనీ వ్యాపారాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న అనిల్ అంబానీ సంస్థలు వాటిని తర్వాత ఇతర సంస్థలు వ్యక్తులకు మళ్లించి మోసానికి పాల్పడిందనే కేసు విషయంలో చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల కోట్ల రుణ మోసానికి సంబంధించి రిపోర్ట్ వెల్లడించిన తర్వాత సీబీఐ రంగంలోకి దిగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో మరోసారి అధికారులు అనిల్ అంబానీని విచారణకు పిలిచే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.