లాలూ ప్రసాద్‌కు సీబీఐ ఝలక్

లాలూ ప్రసాద్‌కు సీబీఐ ఝలక్

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ) షాకిచ్చింది. ఆయనపై ఉన్న అవినీతి కేసులను రీ ఓపెన్ చేసింది. లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్...  బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు చెందిన జేడీయూతో పొత్తు పెట్టుకున్న కొన్ని నెలల తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది.  

యూపీఏ-1 హయాంలో లాలూ  రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2018 లో విచారణ ప్రారంభించిన సీబీఐ 2021లో దర్యాప్తు ముగించింది. అయితే  ఎవరిపై కూడా కేసు నమోదు చేయలేదు. ఈ కేసులో లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్, కుమార్తెలు చందా యాదవ్ , రాగిణి యాదవ్‌ల పేర్లున్నాయి. కాగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రస్తుతం దాణా కుంభకోణం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్య కారణాలతో బెయిల్ పై ఆయన బయటకు వచ్చారు. తన కుమార్తె కిడ్నీ దానంతో శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నారు.