అభిషేక్ కు పలువురు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నయి: సీబీఐ

అభిషేక్ కు పలువురు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నయి: సీబీఐ

న్యూఢిల్లీ, వెలుగు:  ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన బోయినపల్లి అభిషేక్ రావు బెయిల్ పిటిషన్ పై అభిప్రాయం తెలపాలని సీబీఐకి ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం అభిషేక్ రావు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ ను శనివారం సీబీఐ స్పెషల్ కోర్టు విచారించింది. నవంబర్ 4వ తేదీలోపు స్పందన తెలియజేయాలని జడ్జి ఎం.కె. నాగ్ పాల్ సీబీఐకి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అభిషేక్ రావును సీబీఐ ఈ నెల 10న అరెస్ట్ చేసింది. తొలుత హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఆయన ఇంట్లో సోదాలు చేసిన సీబీఐ పలు ఆధారాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసింది. అనంతరం ట్రాన్సిట్‌‌‌‌ వారెంట్‌‌‌‌పై ఢిల్లీకి తరలించింది. లిక్కర్‌‌‌‌‌‌‌‌ కేసులో నిందితుడిగా చేర్చి సీబీఐ స్పెషల్‌‌‌‌ కోర్టు జడ్జి నాగ్‌‌‌‌పాల్ ముందు గతంలో ప్రొడ్యూస్‌‌‌‌ చేసింది.

లిక్కర్‌‌‌‌‌‌‌‌ స్కామ్‌‌‌‌లో భాగంగా అభిషేక్ రావు అకౌంట్ల నుంచి ఇండో స్పిరిట్ ఎండీ సమీర్‌‌‌‌‌‌‌‌ మహేంద్రు అకౌంట్లలోకి రూ.3.85 కోట్లు వచ్చినట్లు కోర్టుకు సీబీఐ తెలిపింది. ముందుగా సౌత్‌‌‌‌ లాబీ పేరుతో ఆ మొత్తం 3 అకౌంట్ల నుంచి అభిషేక్ ఖాతాల్లో జమ అయినట్లు పేర్కొంది. అయితే, మొదటి నుంచి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ కు రాష్ట్రంలోని పలువురు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఇదే వ్యవహారంలో ముంబైకి చెందిన విజయ్ నాయర్, ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రును ఇదివరకే ఈడీ అధికారులు అరెస్టు చేశారు.