అక్రమ మైనింగ్ కేసుల్లో .. అఖిలేశ్ యాదవ్​కు సీబీఐ సమన్లు

అక్రమ మైనింగ్ కేసుల్లో ..  అఖిలేశ్ యాదవ్​కు సీబీఐ సమన్లు

న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్​ మాజీ సీఎం, సమాజ్‌‌‌‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్​ అఖిలేశ్ యాదవ్‌‌‌‌ కు బుధవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. ఐదేండ్ల (2019) క్రితం నమోదైన అక్రమ మైనింగ్ కేసుల్లో సాక్షిగా విచారించేందుకు గురువారం హాజరు కావాలని పేర్కొంది. 2012 నుంచి 2017 మధ్య అఖిలేశ్​ యాదవ్​​యూపీ సీఎంగా ఉన్నారు. అలాగే, 2012 –13 మధ్య మైనింగ్ పోర్ట్‌‌‌‌ ఫోలియోను ఆయనే చూసుకున్నారు. ఆ సమయంలో మైనింగ్ లీజుల జారీకి సంబంధించి ఈ -టెండరింగ్ ప్రక్రియను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. 

దీంతో 2019లో సీబీఐ కేసు నమోదుచేసి ఎంక్వైరీ మొదలు పెట్టింది. మైనింగ్‌‌‌‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించినప్పటికీ అప్పటి ప్రభుత్వ ఉద్యోగులు 2012-–16 మధ్య కాలంలో అక్రమంగా మైనింగ్‌‌‌‌కు అనుమతించారని, లైసెన్సులు రెన్యూవల్ చేశారని ఆరోపించింది. 2013 ఫిబ్రవరి 17న అప్పటి సీఎం అఖిలేశ్ ​యాదవ్​ కార్యాలయం ఒకేరోజు 13 ప్రాజెక్టులను క్లియర్​ చేసిందని పేర్కొంది. ఈ ఆరోపణలపై తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని సీబీఐ ఆదేశించింది.

నోటీసులు వస్తాయని ముందే తెలుసు: అఖిలేశ్​

ఎన్నికలు రాగానే నోటీసులు కూడా వస్తాయని తనకు ముందే తెలుసని ఎస్పీ చీఫ్​ అఖిలేశ్  యాదవ్​​అన్నారు. 2019 లోనూ లోక్‌‌‌‌సభ ఎన్నికల ముందు నోటీసులు ఇచ్చారని, మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో నోటీసులు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.