విచారణకు కవిత సహకరించడం లేదు: సీబీఐ

విచారణకు కవిత సహకరించడం లేదు: సీబీఐ

న్యూఢిల్లీ, వెలుగు:  ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి రౌస్ ఎవెన్యూలోని స్పెషల్​ కోర్టు అప్పగించింది. తనను సీబీఐ ప్రశ్నించడాన్ని, అరెస్టు చేయడాన్ని సవాల్​ చేస్తూ కవిత దాఖలు చేసిన 2 పిటిషన్లను కొట్టివేసింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఆమెను కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కవితను ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు అధికారులు తరలించారు. కస్టడీ రిపోర్టులో సీబీఐ పలు కీలక​విషయాలను ప్రస్తావించారు. లిక్కర్​ స్కామ్​లో కవిత కింగ్​ పిన్​ అని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​తో కలిసి ఆమె కుట్ర పన్నారని పేర్కొంది. 

లిక్కర్ స్కామ్​మనీలాండరింగ్ కేసులో గత నెల 15న హైదరాబాద్​లో కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు కోర్టు అనుమతితో కొన్నిరోజులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న ఆమెను.. గురువారం మధ్యాహ్నం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. కవితకు వ్యతిరేకంగా సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సప్ చాట్స్, ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఆధారాలపై గంటన్నరకు పైగా వాదనలు సాగాయి. సీబీఐ తరఫు సీనియర్ అడ్వకేట్ పంకజ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. లిక్కర్ స్కామ్​లో కవిత కింగ్ పిన్​గా వ్యహరించారని, సూత్రధారితో పాటు పాత్రధారిగా ఉన్నారని అన్నారు. ఆప్ నేతలకు రూ. 100 కోట్లు సమకూర్చడంతో పాటు.. తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీని రూపొందించుకోవడంలో కవిత కీలక పాత్ర పోషించారని వివరించారు. 

ఈ కేసు దర్యాప్తులో సహ నిందితుల వాంగ్మూలాలు నమోదు చేసినట్లు తెలిపారు. అప్రూవర్లుగా మారిన వారితో పాటు కవిత సన్నిహితులు అభిషేక్ బోయినపల్లి, మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, ఇతరులు కవిత పాత్రపై కీలక సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సమాచారంపై కవితను ప్రశ్నించగా.. తప్పించుకునేలా సమాధానాలు ఇస్తున్నారని కోర్టుకు తెలిపారు. అందుకే ట్రయల్ కోర్టు అనుమతితో తీహార్ జైల్లోనే అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కాగా, తీహార్ జైల్లో కవితను ఈ నెల 6న సీబీఐ విచారించడం, అరెస్టు చేయడంపై ఆమె తరఫు అడ్వకేట్లు విక్రమ్ చౌదరి వర్చువల్ మోడ్​లో.. నితీష్ రాణా, మోహిత్ రావు కోర్టు హాల్​లో అభ్యంతరం తెలిపారు. సీబీఐ ప్రశ్నించడం, అరెస్ట్ చేయడంపై తాము దాఖ లు చేసిన పిటిషన్లపై విచారించాలని కోర్టును కోరారు. ఇందుకు అనుమతించిన స్పెషల్ జడ్జి కావేరి బవేజా మధ్యాహ్నం 2 గంటలకు విచారణను వాయిదా వేశారు.

అనంతరం విచారణ ప్రారంభం కాగా.. ప్రతివాది కవిత, ఆమె తరపు న్యాయవాదులైన తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా సీబీఐ వ్యవహరించిందని అడ్వకేట్​ విక్రమ్ చౌదరి వాదించారు. అనంతరం తీర్పును రిజర్వ్​ చేసిన జడ్జి.. సాయంత్రం 4.10 గంటలకు కవితను సీబీఐ కస్టడీకి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు. 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. 3 రోజులు ఇచ్చారు. ఈ నెల 14 వరకు కస్టడీకి అప్పగించిన కోర్టు.. 15న ఉదయం 10 గంటలకు తిరిగి కవితను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.