నీళ్ల సంగతి చూడండి..స్కూళ్లకు CBSE కొత్త రూల్స్​

నీళ్ల సంగతి చూడండి..స్కూళ్లకు CBSE కొత్త రూల్స్​
  • మూడేళ్లలో పుష్కలంగా ఉండాలి.. స్కూళ్లకు సీబీఎస్​ఈ కొత్త రూల్స్​

పోయిన ఎండాకాలంలో చెన్నై సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నీటి కరువు ఎంతలా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. బిందెడు నీళ్ల కోసం తండ్లాడాల్సిన పరిస్థితి ఉంది. సరైన నిర్వహణ లేకపోవడమే దానికి కారణమన్నది నిపుణుల వాదన. అయితే, ఇప్పుడు స్కూళ్లకు సీబీఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఓ కొత్త నిబంధన పెట్టింది. నీటి సమస్యను అధిగమించాలని ఆదేశించింది. వచ్చే మూడేళ్లలో పుష్కలంగా నీళ్లుండేలా స్కూళ్లలో మంచి నీటి నిర్వహణ విధానాలు పాటించాలని సూచించింది. హైదరాబాద్​, చెన్నై, బెంగళూరు సహా 21 నగరాల్లో వచ్చే ఏడాది నీటి కటకట ముప్పు పొంచి ఉందని నీతి ఆయోగ్​ హెచ్చరించిన నేపథ్యంలోనే స్కూళ్లలో నీటి నిర్వహణకు సంబంధించిన విధానాలకు బోర్డు గైడ్​లైన్స్ రూపొందించింది. అందులో భాగంగా స్కూళ్లలో పాటిస్తున్న పాత విధానాలకు స్వస్తి చెప్పాలని సూచించింది. నీటిని మెరుగ్గా వాడుకునే శక్తి ఉన్న కొత్త పరికరాలను పెట్టాలని చెప్పింది. సెన్సర్లతో కూడిన ఆటోమేటిక్​ ట్యాప్​లను బిగించాలని సూచించింది. అవసరాలకు తగ్గట్టు డబుల్​ ఫ్లష్​ ట్యాంకులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. ‘‘నీళ్లు లేని స్కూలు అనేది ఉండడానికి వీల్లేదు. కాబట్టి సీబీఎస్‌‌‌‌‌‌‌‌ఈతో ఉన్న అన్ని స్కూళ్లు పెట్టిన రూల్స్​ అన్నింటినీ విధిగా పాటించాల్సిందే.

వచ్చే మూడేళ్లలో పెట్టిన లక్ష్యాలను చేరాల్సిందే. ఆ లక్ష్యాలను అందుకుంటే ఆ స్కూలు నీటి పరిరక్షణపై ఎంత బాధ్యతతో ఉందో తెలుస్తుంది” అని సీబీఎస్​ఈ సీనియర్​ అధికారి ఒకరు చెప్పారు. తాగడానికి, బాత్రూంలకు, గార్డెన్లకు, ఆట స్థలాలకు స్కూళ్లు ఎక్కువగా నీళ్లు వాడుతుంటాయని, వాడడమే కాకుండా నీటిని ఆదా చేసుకోవడం, కాపాడుకోవడమూ వాటి బాధ్యతేనని అన్నారు. నీటి సంరక్షణ కోసం ‘స్కూల్​ వాటర్​ మేనేజ్​మెంట్ కమిటీ’లను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అన్ని స్కూళ్లకు ఆయన పిలుపునిచ్చారు. ఆ కమిటీల్లో స్కూలు ఓనర్లు, టీచర్లు, స్టూడెంట్లు, నాన్​ టీచింగ్​ స్టాఫ్​, స్టూడెంట్ల తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలన్నారు. స్కూల్లో నీటి వాడకంపై ఆ కమిటీదే పూర్తి బాధ్యతన్నారు. ఎప్పటికప్పుడు నీటి వినియోగంపై సమీక్షలు జరపాలన్నారు. అలాగైతేనే నీటిని వృథా చేయకుండా మెరుగ్గా వాడుకునేందుకు వీలవుతుందన్నారు.