జీన్ మారితే.. మందులు పడవ్!

జీన్ మారితే.. మందులు పడవ్!
  • జీన్స్ ను బట్టే.. ఎవరికి ఎంత డోస్ అన్నది నిర్ణయించాలె
  • ‘పర్సనలైజ్డ్ మెడిసిన్’ పై సీసీఎంబీ సైంటిస్టుల రీసెర్చ్

ఉప్పల్(హైదరాబాద్), వెలుగుకొన్ని మందులు కొంత మందికి పడవు. కొందరికి దద్దుర్లు వస్తయి. మరికొందరికి వాంతులవుతుంటయి. ఇంకొందరికి ఆ మందులతో హెల్త్ సమస్య కొంచెం కూడా తగ్గదు. అయితే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు ఉపయోగపడే కీలక జీన్ సీక్వెన్స్‌‌ను గుర్తించామని హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సైంటిస్టులు వెల్లడించారు. భవిష్యత్తులో ఎవరికి, ఏ మందు, ఎంత డోసేజ్ ఇస్తే పర్ఫెక్ట్ గా సరిపోతుందో తెలుసుకునేందుకు తమ రీసెర్చ్ ఉపయోగపడుతుందని, ఆయా మందులతో ట్రీట్ మెంట్లు ఎఫెక్టివ్ గా చేసేందుకు, తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్, రియాక్షన్లు రాకుండా అడ్డుకునేందుకూ వీలవుతుందని వారు వెల్లడించారు.

మందులు ఎందుకు పడ్తలేవ్?

ఏదైనా హెల్త్ సమస్య వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరకు పోతాం. మన జెండర్, ఏజ్, బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) వంటి వాటిని బట్టి డాక్టర్ వివిధ డోస్ లలో మందులు రాస్తుంటారు. అయితే కొందరికి అవి పడవు. ఎందుకిలా జరుగుతుందంటే.. ఆ మందులను మన ఒంట్లో కలిసేలా చేసే ఎంజైమ్ లే అసలు కారణమని సీసీఎంబీ సైంటిస్టులు అంటున్నారు. ఒక్కో రకమైన మందును ఒక్కో రకమైన స్ట్రక్చర్ లో ఉన్న ఎంజైమ్ లే మెటబాలైజ్ చేయగలవంటున్నారు. అయితే ఆ ఎంజైమ్ ల స్ట్రక్చర్ లు సైటో క్రోమ్ పీ4502సీ0 (సిప్2సీ9) అనే జీన్ సీక్వెన్స్ పై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ జీన్ సీక్వెన్స్ మారితే.. లివర్‌‌లో సిప్2సీ9 ఎంజైమ్ ఉత్పత్తిపైనా ఎఫెక్ట్ పడుతుందన్నారు. అందుకే ఆయా మందులు ఒంటికి పట్టాలంటే ఎంజైమ్ లు కూడా పర్ఫెక్ట్ స్ట్రక్చర్‌‌లో ఉండాలంటున్నారు.

20% మందికి డ్రగ్ మెటబాలిజం సమస్య

దేశవ్యాప్తంగా 36 ప్రాంతాల్లోని 1,488 మందిలో సిప్2సీ9 జీన్ సీక్వెన్స్ లో ఉన్న డైవర్సిటీని సీసీఎంబీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కె. తంగరాజ్ ఆధ్వర్యంలో స్టడీ చేశారు. దక్షిణాసియాలోని ఇతర దేశాలకు చెందిన 1,087 మంది జీన్స్‌‌తోనూ మనోళ్ల జీన్స్ ను పోల్చి చూశారు. దక్షిణాసియాలో సిప్2సీ9 జీన్ లో11 రకాలుంటే, ఒక్క మన దేశంలోనే 8 కొత్త రకాల ఉన్నట్లు గుర్తించామని రీసెర్చ్ ఫస్ట్ ఆథర్ డాక్టర్ నిజాముద్దీన్ తెలిపారు. 20 శాతం మందిలో సిప్2సీ9*3 అనే వేరియంట్ ఉన్నట్టు గుర్తించామన్నారు. ఈ జీన్ ఉన్నవారిలో డ్రగ్ మెటబాలిజం సమస్య ఉంటుందని, మొత్తం 8 వేరియంట్లలోనూ ఇలాంటి సమస్యలు ఉంటాయని తేలిందని పేర్కొన్నారు. పేషెంట్లకు వారి బాడీలోని సిప్2సీ9 జీన్ సీక్వెన్స్ బట్టి.. ఏది కరెక్ట్ డోస్ అన్నది నిర్ణయించాల్సి ఉంటుందని తంగరాజ్ చెప్పారు.