న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 5 నెలల్లో 23 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని జోడించిందని కేంద్ర రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి అన్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల సామర్ధ్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 252 గిగావాట్లు నాన్-ఫాసిల్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఉంది. మొత్తం విద్యుత్ సామర్థ్యంలో ఇది 50శాతానికి సమానం. పారిస్ ఒప్పందంలోని ఎన్‌డీసీ లక్ష్యాలను 5 ఏళ్ల ముందే చేరుకున్నామని జోషి అన్నారు. జీ20 దేశాల్లో 2030 లక్ష్యాలను 2021లోనే చేరిన ఏకైక దేశం భారత్ అని తెలిపారు.
సోలార్ రూఫ్‌లతో ముందుకు..
ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద ఇప్పటివరకు 20 లక్షల ఇళ్లకు సోలార్ కనెక్షన్స్ ఇచ్చింది. ఒక కోటి ఇండ్లకు అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూఫ్‌టాప్ సోలార్ ద్వారా 30 గిగావాట్లు సామర్థ్యం యాడ్ అవుతుందని అంచనా. ఇండియాలో సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యం ప్రస్తుతం 100 గిగావాట్లకు చేరుకుందని, కిందటేడాది మార్చితో పోలిస్తే రెట్టింపు అయ్యిందని జోషి చెప్పారు. పీవీ సెల్ తయారీ సామర్థ్యం 27 గిగావాట్లకు చేరిందన్నారు.
