దుబాయ్‌‌ వెళ్లేందుకు చోరీలు .. అంతర్​ జిల్లా దొంగ అరెస్ట్

దుబాయ్‌‌ వెళ్లేందుకు చోరీలు .. అంతర్​ జిల్లా దొంగ అరెస్ట్
  • రూ.22 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

హనుమకొండ, వెలుగు: సొంత ఇల్లు కట్టుకోవడంతో పాటు దుబాయ్​ వెళ్లేందుకు చోరీలకు పాల్పడుతున్న అంతర్​ జిల్లా దొంగను వరంగల్​ సీసీఎస్, మట్వాడా పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడి నుంచి రూ.22 లక్షల విలువైన 270 గ్రాముల బంగారం, రెండు బైక్​లు, రూ.50 వేల నగదు, సెల్​ఫోన్​ స్వాధీనం చేసుకున్నారు. వివరాలను వరంగల్ సీపీ అంబర్​కిశోర్ ​ఝా వెల్లడించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లికి చెందిన జింక నాగరాజు.. కొంతకాలంగా సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉంటున్నాడు. బైక్​ మెకానిక్​గా పనిచేయడంతో పాటు క్రయవిక్రయాలు కూడా జరిపేవాడు. మొదట జల్సాలకు అలవాటు పడిన నాగరాజు సులభంగా డబ్బులు సంపాదించేందుకు బైక్​ చోరీలను ఎంచుకున్నాడు. ఇలా 2011 నుంచి కరీంనగర్‌‌, జమ్మికుంట, కామారెడ్డి, సిద్దిపేట, వేములవాడ తదితర ప్రాంతాల్లో బైక్​ చోరీలకు పాల్పడి జైలుపాలయ్యాడు.

జైలు శిక్ష పడినా తీరు మారలే

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నాగరాజు ఇల్లు కట్టుకోవడంతో పాటు దుబాయ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన డబ్బుల కోసం మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈసారి బైక్​ చోరీలు కాకుండా ఇండ్లలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.  2016 నుంచి 2022 వరకు వరంగల్‌‌, జనగామ, సిద్దిపేట, భూపాలపల్లి జిల్లాల్లో  38కిపైగా చోరీలు చేసి, గతేడాది మార్చి వరకు జైలు జీవితం గడిపాడు. బయటకు వచ్చి మళ్లీ వరంగల్‌‌ కమిషనరేట్‌‌ పరిధితో పాటు జగిత్యాల, యాదాద్రి జిల్లాలో 20 వరకు చోరీలు చేశాడు. 

దీంతో వివిధ పీఎస్​లలో  కేసులు నమోదు కాగా, ట్రైనీ ఐపీఎస్‌‌ శుభం నాగ్‌‌ అధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు నాగరాజు చోరీ చేసిన నగలను అమ్మేందుకు వరంగల్ వస్తుండగా..ఆర్‌‌ఎన్‌‌టీ రోడ్డు వద్ద పట్టుకున్నారు. విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. నిందితుడిని  పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ట్రైనీ ఐపీఎస్‌‌ శుభం నాగ్‌‌, సెంట్రల్‌‌ జోన్‌‌ డీసీపీ అబ్దుల్‌‌ బారీ, అడిషనల్​ డీసీపీ రవి, వరంగల్‌‌ ఏసీపీ నందిరాం నాయక్‌‌, సీసీఎస్, మట్వాడా సీఐలు అబ్బయ్య, గోపీని సీపీ అభినందించారు.