కైకాలకు ప్రముఖుల నివాళి

కైకాలకు ప్రముఖుల నివాళి

సీనియర్ సినీ నటుడు కైకాల సత్యనారాయణకు సినీ,రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. నటి జీవిత రాజశేఖర్, నటి రాధ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఎమ్మెల్సీ ఎల్ రమణ.. ఫిలింనగర్ లోని కైకాల నివాసంలో ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కైకాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

సీనియర్ నటి రాధ

కైకాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సీనియర్ నటి రాధ తెలిపారు. ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పాలకరించేవారని.. ఆయన ఆత్మకి శాంతిచేకూరాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పారు. కైకాలతో కలిసి 50 సినిమాల్లో నటించానని అన్నారు. చివరిసారిగా హైదరాబాద్ లో ఒక ఫంక్షన్ లో కలిశాను అని రాధ గుర్తు చేసుకున్నారు.

నటి జీవిత రాజశేఖర్

తెలుగు పరిశ్రమలో పెద్దవాళ్లను కోల్పోవడం వర్ణించలేని భాద జీవిత రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరిని కోల్పోతుంటే అనాధ లా అనిపిస్తుందన్నారు. కైకాల మరణం తీరనిలోటు అని ఆమె బాధపడ్డారు.

నిర్మాత అల్లు అరవింద్

కైకాల మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు అని అల్లు అరవింద్ అన్నారు. ఆయనతో మా కుటుంబానికి మంచి బంధం ఉందన్నారు. కైకాల చాలా మంచి వ్యక్తి అని..చిన్నా, పెద్ద అని చూడకుండా అందరితో కలివిడిగా ఉండేవాడు తెలిపారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకున్నారు.

ఎమ్మెల్సీ ఎల్ రమణ 

చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజు...ధృవతార కైకాల అని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. ప్రేక్షకుల ఆధారాభిమానాలతోపాటు.. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే నైజం కైకాలదని అన్నారు. ఎంత పెద్ద డైలాగ్ అయినా.. సునాయాసంగా చెప్పడంలో ఎన్టీఆర్ తర్వాత.. కైకాల నే అని చెప్పారు. కైకాల ఆత్మకి శాంతి కలగాలని.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

కైకాల సత్యనారాయణ నిన్న అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, ఇవాళ ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కైకాల అంతిమ సంస్కారం నిర్వహిస్తోంది.