రైతులకు సపోర్టుగా సెలబ్రిటీల ట్వీట్లు.. తెలుసుకొని మాట్లాడాలని కేంద్రం సీరియస్

రైతులకు సపోర్టుగా సెలబ్రిటీల ట్వీట్లు.. తెలుసుకొని మాట్లాడాలని కేంద్రం సీరియస్
  • సెలబ్రిటీలపై మండిపడ్డ సర్కార్​..
  • అగ్రి చట్టాలపై తెలుసుకుని మాట్లాడాలని సలహా
  • రైతు ఉద్యమానికి సపోర్ట్గా ట్వీట్లు చేసిన గ్రెటా థన్ బర్గ్, మీనా హారిస్, రిహానా, తదితర సెలబ్రిటీలు

న్యూఢిల్లీ: ఢిల్లీ బార్డర్లలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఇంటర్నేషనల్​ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై కేంద్రం మండిపడింది. అగ్రి చట్టాల గురించి, రైతులతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల గురించి ఏమీ తెలియకుండా ఎట్ల స్పందిస్తారని.. ఇవేం ట్వీట్లని విదేశీ వ్యవహారాల శాఖ వారిపై సీరియస్ అయింది. కామెంట్లు చేయడానికి ముందు నిజాలను తెలుసుకోవాలని సూచించింది. విషయం అర్థం చేసుకోకుండానే సోషల్ మీడియాలో సెన్సేషనల్ హ్యాష్ ట్యాగ్ లు, వ్యూస్ కోసం సెలబ్రిటీలు ట్వీట్లు చేయడం బాధ్యతా రాహిత్యమేనని స్పష్టం చేసింది.  మంగళవారం అమెరికన్ పాప్ సింగర్ రిహానా, స్వీడిష్ క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బర్గ్, అమెరికన్ యాక్ట్రెస్ అమందా సెర్ని, యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్​ మేనకోడలు మీనా హారిస్, తదితర సెలబ్రిటీలు ఢిల్లీలో రైతు నిరసనలకు మద్దతుగా ట్వీట్లు చేశారు. దీనిపై బుధవారం విదేశాంగ శాఖ సీరియస్ గా స్పందించింది.

కొన్ని గ్రూపుల స్వార్థం కోసమే..

తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని గ్రూపులు రైతుల నిరసనలపై తప్పుడు ప్రచారం చేసేలా ఇంటర్నేషనల్ సెలబ్రిటీలను వాడుకుంటున్నాయని, ఇది ఆందోళనకర విషయమని విదేశాంగ శాఖ పేర్కొంది. కొత్త అగ్రి చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ విషయంపై కామెంట్లు చేసే ముందు అసలు నిజాలను అర్థం చేసుకోవాలని హితవు పలికింది.

పాప్​స్టార్​ రిహానా ట్వీట్​..

రైతుల నిరసనలు జరుగుతున్న ప్రాంతంలో ఇంటర్నెట్​ను బంద్ చేసిన విషయంపై సీఎన్ఎన్ ఓ కథనాన్ని పబ్లిష్ చేసింది. ఈ కథనాన్ని ట్యాగ్ చేస్తూ ‘మనం ఎందుకు దీని గురించి మాట్లాడటం లేదు? #ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఇన్ ఇండియా’ అంటూ పాప్ స్టార్ రిహానా ట్వీట్ చేశారు.

తప్పుడు ప్రచారం: బాలీవుడ్

ఇంటర్నేషనల్ సెలబ్రిటీల ట్వీట్లపై బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, కరణ్ జోహార్, కంగనా రనౌత్ తదితరులు ఫైర్ అయ్యారు. దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారానికి పడిపోవద్దని పేర్కొన్నారు.  రైతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై కాకుండా..  విభేదాలు సృష్టిస్తున్న వారి మాటలపైనే ఫోకస్ పెడ్తున్నారంటూ విమర్శించారు.

దుష్ప్రచారంతో దెబ్బతీయలేరు

‘విదేశీ సెలబ్రిటీలు చేసే దుష్ప్రచారాలు మన దేశ ఐకమత్యాన్ని దెబ్బతీయలేవని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చెప్పారు. ఇండియా ఐకమత్యాన్ని ఏ దుష్ప్రచారమూ దెబ్బతీయలేదు. ఇండియా కొత్త శిఖరాలను అందుకోవడాన్ని ఏ ప్రాపగండా ఆపలేదు. ఇండియా భవిష్యత్తును నిర్ణయించేది అభివృద్ధే తప్ప తప్పుడు ప్రచారం కాదు. ఐకమత్యంతోనే దేశం ముందుకు సాగుతుంది’ అంటూ అమిత్​ షా ట్వీట్​ చేశారు.

For More News..

కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంలో ఇండియా రికార్డ్

నేడు వరల్డ్​ క్యాన్సర్ డే.. బ్రెస్ట్‌‌ క్యాన్సర్‌ లక్షణాలెంటో తెలుసుకోండి

ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా? అయితే ఇలా చేయండి..