
గుంటూరు : చిత్తూరు జిల్లాలోని నగరి సమీపంలో మూడు కోట్ల విలువైన సెల్ ఫోన్ ల చోరీ మరవకముందే గుంటూరు జిల్లాలో అదే తరహా దోపిడీ జరిగింది. మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై సెల్‌ఫోన్లు తరలిస్తున్న కంటైనర్ ను దోపిడి చేశారు. శ్రీసిటీ నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా ఈ చోరీ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కంటైనర్ వెనుక భాగం పగులగొట్టి ఫోన్లను చోరీ చేశారు దుండగులు. సుమారు రూ. 80 లక్షల విలువ చేసే 980 సెల్‌ఫోన్లను చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఘటనాస్థలికి గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ… లారీ లో 9 కోట్ల విలువ చేసే సెల్ ఫోన్ లు ఉన్నాయని, డ్రైవర్ ను విచారణ చేయడం జరిగిందన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ , సిసి పుటేజ్ ద్వార నిందితుల ఆధారాలను గుర్తిస్తున్నామన్నారు. మధ్యప్రదేశ్, తమిళనాడు గ్యాంగ్ ల పనిగా అనుమానిస్తున్నామని, చోరీ ఘటనపై 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే ముద్దాయిలను అరెస్ట్ చేస్తామని చెప్పారు.