ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకు సిమెంట్, స్టీల్..కంపెనీలతో 3 శాఖల అధికారుల మీటింగ్ 

ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకు సిమెంట్, స్టీల్..కంపెనీలతో 3 శాఖల అధికారుల మీటింగ్ 

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు తక్కువ ధరకు సిమెంట్, స్టీల్ ను సరఫరా చేయాలని కంపెనీలను ఉన్నతాధికారులు కోరారు. మార్కెట్ రేటు కంటే ఎంత తక్కువకు సరఫరా చేస్తారో తెలుపుతూ ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. ఈ అంశంపై ఇటీవల​ సిమెంట్, స్టీల్ కంపెనీలకు చెందిన 15 మంది ప్రతినిధులతో ఇండస్ట్రీస్​ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్, ఇండస్ట్రీస్​ ఇన్ చార్జి కమిషనర్ మల్సూర్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం సమావేశమయ్యారు.

బహిరంగ మార్కెట్ లో సిమెంట్ బస్తా ధర రూ. 320 ఉండగా , స్కీమ్ కు రూ. 260కు సప్లై చేయాలని, స్టీల్ మార్కెట్ లో టన్ను  రూ. 50 వేలు, రూ. 55 వేలు ఉండగా రూ. 47 వేలకు సరఫరా చేయాలని కంపెనీల ప్రతినిధులను అధికారులు కోరినట్లు సమాచారం. ఒక్కో ఇంటికి  180 బస్తాల సిమెంట్ లెక్కన ఈ ఏడాది 4 లక్షల 50 వేల ఇండ్లకు 9 మెట్రిక్ టన్నుల సిమెంట్, ఒక్కో ఇంటికి  1500 కిలోల ఐరన్ చొప్పున 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ఐరన్ అవసరమని  కంపెనీల ప్రతినిధులకు అధికారులు తెలిపారు. వచ్చే 5 ఏండ్లు రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొత్తం స్కీమ్ కు ఎంత సిమెంట్, స్టీల్ అవసరమవుతుందన్న సమగ్ర వివరాలు సిమెంట్, స్టీల్ కంపెనీల ప్రతినిధులకు ప్రభుత్వ ఉన్నతాధికారులు అందజేశారు.   సోమవారంలోపు ప్రతిపాదనలు అందజేయాలని అధికారులు కోరారు. కంపెనీల నుంచి ప్రతిపాదనలు అందగానే  గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, గతంలో హౌసింగ్ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేస్తామని అధికారులు చెప్తున్నారు.