సవాళ్లున్నా ముందుకే.. సిమెంట్ కంపెనీలకు భారీ లాభాలు

సవాళ్లున్నా ముందుకే.. సిమెంట్ కంపెనీలకు భారీ లాభాలు
  • ఏటా ఏడు శాతం వృద్ధికి అవకాశం
  • ప్రభుత్వ ఇన్​ఫ్రా ప్రాజెక్టులతో ఎంతో మేలు

న్యూఢిల్లీ: వర్షాకాలం ప్రారంభానికి ముందు అందరి దృష్టీ సిమెంట్‌‌‌‌‌‌‌‌ రంగంపై ఉంది. బలహీనమైన వర్షపాతం సూచనలు, మిడిల్ ఈస్ట్​లో యుద్ధం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ.. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్​లో సిమెంట్​ కంపెనీలు మెరుగైన ఫలితాలు సాధిస్తాయని భావిస్తున్నారు. ఇన్​ఫ్రాపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేయడం, చిన్న నగరాల్లో ఇళ్లకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరగడం సిమెంట్​ రంగానికి ఊతమిస్తున్నాయి. ఈ రంగంలో టాప్​ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ ఆదాయం​ నాలుగో క్వార్టర్​లో 18 శాతం పెరిగింది. అంబుజా సిమెంట్స్ నికర లాభం 37.4 శాతం పెరిగి రూ.1,857.43 కోట్లకు చేరింది. మిగతా  కంపెనీలు కూడా భారీ లాభాలు సాధిస్తాయని భావిస్తున్నారు. ఇంధన ఖర్చుల భారం పెరిగినప్పటికీ.. డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరగడం వల్ల కంపెనీలు ఆ ప్రభావాన్ని అధిగమిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

మౌలిక సదుపాయాలు, ఇళ్ల నిర్మాణం

ప్రభుత్వ రోడ్లు, రైల్వేలు, పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సిమెంట్​ వినియోగాన్ని భారీగా పెంచుతున్నాయి. 2026–2030 మధ్య డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఏటా  ఏడు శాతం పెరగవచ్చని అంచనా. 2027 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో మూలధన వ్యయం (క్యాపెక్స్) కోసం రూ.12.2 లక్షల కోట్లను కేటాయించారు. ఇందులో రోడ్ల కోసం సుమారు రూ.2.87 లక్షల కోట్లు, రైల్వేల కోసం రూ.2.55 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ (పీఎంఏవై-జీ) పథకం కింద ఇళ్ల నిర్మాణానికి రూ.54 వేల కోట్లు కేటాయించారు. పీఎంఏవై-యూ కింద పట్టణ ప్రాంతాల్లో కూడా ఇళ్ల నిర్మాణం వేగవంతం కానుంది. 2024లో జీడీపీలో 5.3 శాతంగా ఉన్న మౌలిక సదుపాయాల వ్యయం 2029 నాటికి 6.5 శాతానికి పెరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు.

పెరిగిన ధరలు, ఖర్చులు

మిడిల్ ఈస్ట్​లో యుద్ధాల వల్ల ఇంధనం, ప్యాకేజింగ్ ఖర్చులు పెరిగినప్పటికీ.. ధరల పెంపు ద్వారా కంపెనీలు ఆ భారాన్ని అధిగమిస్తాయని కోటక్ సెక్యూరిటీస్ తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరంలో సిమెంటుకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఎనిమిది శాతం పెరిగింది. 2027లో ఏడు శాతం వృద్ధి ఉండే అవకాశం ఉంది. గత సెప్టెంబర్​లో సిమెంట్​పై జీఎస్​టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం ఈ రంగానికి ఎంతో మేలు చేసింది. వర్షాకాలం వల్ల ఆర్థిక కార్యకలాపాలు తగ్గి 2027 రెండో క్వార్టర్​లో సిమెంట్ కంపెనీలపై కొంత ఒత్తిడి ఉండవచ్చని ఎలారా క్యాపిటల్ అభిప్రాయపడింది. అంతర్జాతీయ సరఫరా ఇబ్బందుల వల్ల పెట్రోలియం, కోక్ ధరలు పెరగడం లాభదాయకతను దెబ్బతీయవచ్చు. అల్ట్రాటెక్ సిమెంట్ 2028 ఆర్థిక సంవత్సరం నాటికి మెరుగైన లాభాలను సాధిస్తుందని అంచనా. కంపెనీ ఇబిటా మార్జిన్లు 21 శాతానికి చేరవచ్చు. ఖర్చుల భారం ఉన్నప్పటికీ, ప్రభుత్వ మద్దతు, ఇళ్ల నిర్మాణ రంగంలో వృద్ధి వల్ల సిమెంట్​ రంగ భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది.