రామప్ప టెంపుల్‌కు సున్నం బదులు సిమెంట్ వాడకం

V6 Velugu Posted on Sep 19, 2021

హైదరాబాద్, వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రుద్రేశ్వరాలయంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారుల చర్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిర్మాణంలోని రాళ్ల మధ్య ఏర్పడిన గ్యాప్ ని పూడ్చేందుకు రాస్తున్న సిమెంట్ పూతలు ఆలయ నిర్మాణ విశిష్టతను దెబ్బతీస్తున్నాయి. ఆలయానికి ఏ చిన్న మరమ్మతు చేయాల్సి వచ్చినా రామప్ప ఆలయ నిర్మాణ కాలం నాటి ముడి సరుకును, రాయినే వినియోగించాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. డంగు సున్నంకు బదులు సిమెంట్ వాడుతుండటంతో అది కాస్తా ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. డంగు సున్నం తయారీకి టైం పడుతుందని ఇన్ స్టంట్ గా గ్యాప్​కనిపించిన చోట సిమెంట్ వేసి మమ అనిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నేండ్లుగా ఇది సాగుతున్నా యునెస్కో గుర్తింపు వచ్చాక నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని నిపుణులు అంటున్నారు. 

టెక్నాలజీ అందుబాటులో ఉన్నా..

సుమారు 1,500 ఏండ్ల క్రితం నాటి నిర్మాణాలు కూడా ఈ నాటికి చెక్కు చెదరకుండా కనువిందు చేస్తున్నాయంటే కారణం నిర్మాణాల్లో వాడిన టెక్నాలజీ, డంగు సున్నమే. డంగు సున్నం మిశ్రమంలో డంగు సున్నం, రాతి పొడి, గుడ్డు సొన, కరక్కాయ, నల్లబెల్లం కలిపి చాలా మెత్తని పేస్ట్  చేస్తారు. ఈ మిశ్రమం తయారీకి ముందు 21 రోజులు కరక్కాయలను నానబెడతారు. ఇప్పుడు గ్రౌటింగ్​కు సిమెంట్‌‌ వాడుతున్నట్లే అప్పట్లో ఈ డంగు సున్నాన్నే వాడేవారు. 1914లో నిజాం హయాంలో ప్రముఖ చరిత్రకారుడు గులాం యాజ్దాని ఆధ్వర్యంలో రామప్ప ఆలయ పునరుద్ధరణ పనులు జరిగాయి. ఆలయం చుట్టూ సపోర్ట్ పిల్లర్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం సమీపంలోని వెలుతుర్లపల్లిలోని క్వారీ నుంచే ఇసుకరాతిని తరలించారు. ఇందులో డంగు సున్నమే వాడారు. దీంతో సపోర్ట్ పిల్లర్లు కూడా కాకతీయుల కాలం నాటివి లాగే  కలిసిపోయాయి. ఇదే  డంగు సున్నం (లైమ్‌‌ మోర్టార్‌‌)ను వరంగల్​ నిట్ లో​ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్​మెంట్ స్కాలర్స్ ఇటీవల కాల్ సైట్, క్వార్ట్జ్​ఖనిజ మిశ్రమంతో కలిపి ఎక్స్‌‌రే డిఫ్రాక్షన్‌‌ ప్రక్రియ ద్వారా సిద్ధం చేశారు. ఇప్పుడు డంగు సున్నం తయారీ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసే అవకాశమున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. సిమెంట్ తోనే పని కానిచ్చేస్తున్నారు. 

పట్టించుకునేదే లేదు..

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రాగానే మంత్రులు, అధికారులు సంబురాలు జరిపారు. ఆలయాన్ని సందర్శించి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామన్నారు. మళ్లీ అటువైపు  చూడలేదు. వచ్చే అక్టోబర్ లో యునెస్కో టీమ్​ వస్తుందనే సమాచారమున్నా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు ప్రారంభించలేదు. ఉప ఆలయాల పునరుద్ధరణకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదు. పైగా వీటిని పక్కనబెట్టి కొత్త నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి సరిగ్గా మూడ్రోజుల ముందు ములుగు కలెక్టర్ చైర్మన్ గా పాలంపేట స్పెషల్ డెవలప్​మెంట్ అథారిటీ(పీఎస్​డీఏ)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ.. ఇప్పటివరకు అభివృద్ధి పనులకు పైసా రిలీజ్​ చేయలేదు. రామప్పకు వచ్చే సందర్శకుల వెహికల్స్ పార్కింగ్ కు చోటు లేక రోడ్ల మీదనే నిలపాల్సి వస్తోంది.

మొదటికే మోసం వస్తది

రామప్ప రుద్రేశ్వరాలయానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ హోదా రావడానికి సుమారు పదేండ్లు పట్టింది. అనేక అడ్డంకులు, అభ్యంతరాలు, కండీషన్ల మధ్య ఈ హోదా దక్కింది. దీన్ని నిలబెట్టుకోవాలంటే యునెస్కో చేసిన సూచనలు, నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే యునె స్కో హోదాను కోల్పోయే ప్రమాదముందని పురావస్తు పరిశోధకులు, రామప్ప ఆలయ పరిరక్షణ సమితి బాధ్యులు హెచ్చరిస్తున్నా రు. వచ్చే అక్టోబర్ లో యునె స్కో బృందం రామప్పను సందర్శించ నుండటంతో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలంటున్నారు. వారం క్రితం కూడా సిమెంట్ తో అక్కడక్కడ అతుకులు వేశారని, కొత్తగా కనిపించే ఇలాంటి పూతలపై యునెస్కో టీమ్ అభ్యంతరం వ్యక్తం చేయొచ్చని హెచ్చరిస్తున్నారు..

విశిష్టతను రక్షించాలె..

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చి 55 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు ప్రారంభించలేదు. ప్రహరీ గోడను పునరుద్ధరించలేదు. ఆలయ పునరుద్ధరణ, చిన్నచిన్న మరమ్మతు పనుల్లో గతంలోనూ సిమెంట్ వాడారు. ఇప్పుడు అదే కొనసాగుతోంది. ఇది సరి కాదు. ప్రాచీన పద్ధతుల్లో డంగు సున్నాన్నే వినియోగిస్తే టెంపుల్ స్ట్రక్చర్ సహజత్వం కోల్పోకుండా ఉంటుంది. అలాగే వచ్చే సందర్శకులకు స్థానికంగా భోజనం, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి. 
-  ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్ రావు, రామప్ప ఆలయ పరిరక్షణ సమితి

Tagged construction, cement, ramappa temple, lime

Latest Videos

Subscribe Now

More News