వీఐ బకాయిలు ఈక్విటీగా మార్పుపై కేంద్రం గ్రీన్ సిగ్నల్

వీఐ బకాయిలు ఈక్విటీగా మార్పుపై కేంద్రం గ్రీన్ సిగ్నల్
  • ఈ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​
  • 33 శాతం వాటా ప్రభుత్వానికి సొంతం

న్యూఢిల్లీ: వోడాఫోన్ ఐడియా రూ.16 వేల కోట్ల విలువైన అడ్జెస్టెడ్ ​గ్రాస్​ రెవెన్యూ (ఏజీఆర్​) బకాయిలను చెల్లించలేకపోవడంతో వాటిని ఈక్విటీగా మార్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.  దీంతో వొడాఫోన్ ఐడియా ఒక్కో షేరుకు రూ.10 ధరతో రూ.16,133.1 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుంది. తాము కంపెనీ నడపడానికి కట్టుబడి ఉన్నామని, అవసరమైన నిధులను తీసుకువస్తామని బిర్లా నుంచి హామీ రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు కారణంగా టెల్కోలో దాదాపు 33శాతం వాటాతో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా మారుతుంది. వొడాఫోన్​ ఐడియా  కో-ప్రమోటర్లు యూకే  వోడాఫోన్ గ్రూప్​నకు 47.61శాతం , ఆదిత్య బిర్లా గ్రూప్​నకు  27.38శాతం వాటాలు ఉన్నాయి.  ప్రభుత్వానికి 33 శాతం వాటా వెళ్లడంతో వీఐ వాటా  31.8శాతానికి, ఆదిత్య బిర్లా గ్రూప్​ వాటా  18.3శాతానికి తగ్గుతాయి. వీఐ, ఆదిత్యా బిర్లాలకు కలిపి 50శాతానికిపైగా ఉంటుంది. “ఆదిత్య బిర్లా గ్రూప్ వీఐని నడపాలని, అవసరమైన పెట్టుబడులను తీసుకురావాలని మేం కోరాం. ఇందుకు బిర్లా అంగీకరించింది. అందుకే మేం ఈక్విటీ కన్వర్షన్​కు అంగీకరించాం. భారతదేశంలో మూడు టెల్కోలతోపాటు బీఎస్​ఎన్​ఎల్​ ఉండాలని,  యూజర్లకు ఆరోగ్యకరమైన పోటీని అందించాలని కోరుకుంటున్నాం ”అని కేంద్ర టెలికం, కమ్యూనికేషన్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. 

నిధుల కొరతతో వీఐ సతమతం

ఈక్విటీ కన్వర్షన్  వలన వీఐకి ఇండస్ టవర్స్ వంటి  బకాయిలను చెల్లించడం, ప్రస్తుత 4జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను విస్తరించడానికి పెట్టుబడిదారుల నుండి నిధులను సేకరించడం ఆలస్యమవుతుంది. చందాదారుల నష్టాలను నివారించడానికి, ఎరిక్సన్,  నోకియా వంటి వాటితో 5జీ పరికరాల సరఫరా ఒప్పందాలను ఖరారు చేయడానికి వీఐకి చాలా డబ్బు అవసరం. ఈక్విటీ, డెట్​ ద్వారా రూ.20 వేల కోట్లు సేకరించడానికి వీఐ చాలాకాలంగా చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్​ కావడం లేదు. సంస్థ సహ–యజమానులు దాదాపు రూ.ఐదువేల కోట్లు సంస్థకు సమకూరుస్తారని తెలుస్తోంది. వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చాలని వీఐ ఏడాదిగా ప్రభుత్వాన్ని కోరుతోంది.  పోయిన ఏడాది సెప్టెంబరు చివరి నాటికి, వీఐకి దాదాపు రూ. 2.2 లక్షల కోట్ల నికర అప్పు ఉంది.  దీని గ్రాస్​ క్యాష్​బ్యాలెన్స్​ రూ. 190 కోట్లు. బ్యాంకులు, ఇతర లెండర్లకు రూ.15,080 కోట్లు కట్టాలి. టవర్ సంస్థలు, నెట్‌‌‌‌వర్క్ ప్రొవైడర్లు, సప్లయర్లకు రూ.15,030 కోట్లు చెల్లించాలి.  సంస్థను నిలబెట్టడానికి మొత్తం రూ. 40,000 కోట్లు–-45,000 కోట్లు అవసరమని ఎనలిస్టులు అంటున్నారు. శుక్రవారం బీఎస్‌‌‌‌ఈలో వొడాఫోన్ ఐడియా షేర్లు ఒకశాతం లాభంతో రూ.6.89 వద్ద ముగిశాయి.