రాష్ట్రానికి ఎస్డీఆర్ఎఫ్ కింద రూ.188 కోట్లు రిలీజ్

రాష్ట్రానికి ఎస్డీఆర్ఎఫ్ కింద రూ.188 కోట్లు రిలీజ్

న్యూఢిల్లీ, వెలుగు:  స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.188.80 కోట్లు రిలీజ్ చేసింది. గత ఖర్చులు, ప్రాంతం, జనాభా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిధులు కేటాయించినట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని గుర్తు చేసింది. ప్రకృతి విపత్తులను దృష్టిలో పెట్టుకుని ఫండ్స్ విడుదల చేశామని తెలిపింది. గతేడాది రిలీజ్ చేసిన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ కోరకుండా గైడ్​లైన్స్ మారుస్తూ తక్షణ సాయం కింద ఈ మొత్తాన్ని అందజేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర హోంశాఖ సూచలన మేరకు దేశంలోని 22 రాష్ట్రాలు/యూటీలకు కలిపి మొత్తం రూ.7,532 కోట్లు రిలీజ్ చేసినట్లు పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2021–22 నుంచి 2025–26 ఫైనాన్షియల్ ఇయర్స్​కు ఎస్డీఆర్ఎఫ్ కోసం రూ.1,28,122.40 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. తాజా నిధుల విడుదలతో రాష్ట్రాలకు రిలీజ్ చేసిన ఎస్డీఆర్ఎఫ్ కేంద్రం వాటా రూ.42,366 కోట్లకు చేరిందని స్పష్టం చేసింది.